ETV Bharat / state

పర్యావరణ హితం కోసం రీపర్పస్.. ముంబయి యువతి ఘనత

author img

By

Published : Sep 16, 2020, 5:05 AM IST

అధ్యయనాల ప్రకారం ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి. ప్రకృతి సహజత్వం కోల్పోయి... జీవజాతుల మనుగడకు పెనుముప్పు వాటిల్లుతోంది. ఈ అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. అడ్డుకట్ట వేయాలన్న పర్యావరణ స్పృహ ఎంతోకొంత ఉంది. లేనిదల్లా ఆచరణలో పెట్టే ఆలోచనే. ఆ ఆలోచన వచ్చిన ముంబయి యువతి... ఆలస్యం చేయలేదు. డంపింగ్ యార్డులు, ఖాళీస్థలాలు, సముద్రాల్లోకి చేరకుండా చెత్తను మార్గమధ్యలోనే రీసైకిల్ చేసి, మరోసారి వాడేందుకు సిద్ధం చేస్తోంది స్వానికా బాలసుబ్రమణియన్.

పర్యావరణ హితం కోసం రీపర్పస్.. ముంబయి యువతి ఘనత
పర్యావరణ హితం కోసం రీపర్పస్.. ముంబయి యువతి ఘనత

పర్యావరణ హితం కోసం రీపర్పస్.. ముంబయి యువతి ఘనత

అది దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని అతిపెద్ద డంపింగ్ యార్డు. డియోనార్ గార్బేజ్‌ డంప్‌గా పిలిచే ఆ ప్రాంతంలో ఓసారి క్షేత్ర పరిశీలనకు వెళ్లింది స్వానికా బాలసుబ్రహ్మణ్యం. కనుచూపు మేర అంతా కొండలా పేరుకుపోయిన వ్యర్థాలు చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురైంది. ముంబయి నగరాన్ని ఆక్రమించిన అందమైన నీలిమేఘాలతో నిండి ఉన్న నిర్మలమైన ఆకాశం ఒకవైపు... కళ్లు చూడగలిగినంత దూరంలో దుర్వాసన వెదజల్లుతూ నేలను ఆక్రమించేసిన వ్యర్థాలు మరొకవైపు... ఒకేసారి ఈ 2 విభిన్న దృశ్యాలు చూసి, ఇంటికి వెనుదిరిగింది స్వానిక.

రూపురేఖలు మార్చాలని నిర్ణయం..

డియోనార్‌ డంపింగ్ యార్డుపై ఆధారపడి, ముంబయిలోని ఎంతోమంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వారందరికీ భిన్నంగా... సమాజహితం కోసం పనిచేసే కబాడీవాలాస్... ఇంటింటికీ వెళ్లి, రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలు కొని, పెద్దస్థాయి రీసైక్లింగ్ సంస్థలకు అమ్ముతారు. పర్యావరణ హితార్థం వాళ్లు కొంతలాభం పొందుతూ పనిచేస్తున్నా... ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. రోజువారీ ఆదాయమూ 100 రూపాయల లోపే. వాళ్ల పరిస్థితి దగ్గరుండి గమనించిన స్వానిక... మార్కెట్‌కు కబాడీవాలాస్‌ను నేరుగా అనుసంధానం చేయడం సహా డంపింగ్ యార్డు రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకుంది.

రీపర్పస్ సంస్థ..

స్నేహితుడు వాంగ్ హెందల్‌తో కలిసి రీపర్పస్ అనే సంస్థ స్థాపించింది స్వానిక. పేరుకు తగ్గట్టుగానే...చెత్తగా మారిన ప్రతి వస్తువునూ తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా తయారు చేయడమే లక్ష్యంగా సంస్థను నడిపిస్తోంది. దీనిద్వారా కబాడీవాలాస్ ఆదాయాన్ని పెంచడమే కాక రీసైక్లింగ్ పెంచుతోంది. ప్రస్తుతం కంటే ఎక్కువ చెత్తను రీసైకిల్ చేయగలిగే సామర్థ్యం కోసం పనిచేస్తోంది. డంపింగ్ కుప్పలు మరింతలా పెరిగిపోకుండా చేసేందుకు శ్రమిస్తోంది.

రీసైక్లింగ్..

ముంబయి వేదికగా...1,500 ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, రీసైక్లింగ్‌ను చేపట్టింది రీపర్పస్. ఈ మేరకు 10 మంది రీసైక్లర్లు, 150 మంది కబాడీవాలాస్‌తో ఒప్పందం చేసుకుంది స్వానిక. ఇలా రీపర్పస్‌ను స్థాపించిన మొదటి ఏడాదిలో 5,400 టన్నుల వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చేరక ముందే రీసైకిల్ చేసింది స్వానిక. కబాడీవాలాలకు 40వేల డాలర్ల ఆదాయం సృష్టించగలిగింది.

మొబైల్ యాప్..

స్వానిక పుట్టగానే ఆమె కుటుంబం ముంబయి నుంచి మస్కట్‌కు వెళ్లింది. అక్కడే పెరిగిన స్వానిక... భారత స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్న తాత, నానమ్మలను ఆదర్శంగా తీసుకుంది. వారిలా తన దేశానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని బాల్యం నుంచీ కలలు కనేది. పాఠశాల రోజుల్లోనే శరణార్థులు, మానవ హక్కుల విభాగం కోసం పనిచేసింది. రీపర్పస్‌ ద్వారా... కబాడీవాలాస్‌ కోసం ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఎక్కడెక్కడ నుంచి వ్యర్థాలు సేకరించాలి, వాటిని ఎక్కడికి చేరవేయాలన్న వివరాలు అందులో పొందుపరుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..

వ్యర్థాల ఆధారిత సంస్థ నడుపుతానని తానెప్పుడూ అనుకోలేదని చెప్తోంది స్వానిక. అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది. రీపర్పస్ సేవలను భారత్‌లోని వివిధ నగరాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్న స్వానిక....కబాడీవాలాల వ్యవస్థను అన్ని నగరాల్లోకీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి: సరిహద్దులో భారత్ దేనికైనా రె'ఢీ': రాజ్​నాథ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.