ETV Bharat / state

పీవీ నరసింహారావుకు ప్రముఖుల ఘన నివాళులు

author img

By

Published : Dec 23, 2022, 1:42 PM IST

PV Narasimha Rao
PV Narasimha Rao

PV Narasimha Rao Death Anniversary: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ పీవీఘాట్‌ వద్ద వివిధ పార్టీలకు చెందిన నాయకులు దివంగత నేతకు ఘననివాళి అర్పించారు. దేశానికి పీవీ అందించిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు.. ప్రజాసేవకు ఆయన బాటలో పయనిస్తామని తెలిపారు.

PV Narasimha Rao Death Anniversary: బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు దేశానికి, మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేశారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొనియాడారు. పీవీ 18వ వర్ధంతిని పురస్కరించుకుని.. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని దివంగత నేత సమాధి వద్ద ఆమె పూలమాలలు ఉంచి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీవీ ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కంటివైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పీవీ చూపిన బాటలోనే దేశం పయనిస్తుందని తమిళిసై తెలిపారు.

పీవీ నరసింహారావుతో తనకున్న అనుబంధాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ నేతలు వీహెచ్, కేవీపీ, శ్రీధర్‌బాబుతో కలిసి పీవీ ఘాట్‌లో దిగ్విజయ్‌ నివాళి అర్పించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ప్రధానిగా ఉన్న పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచారని దిగ్విజయ్‌ తెలిపారు.

దేశానికి ప్రధానిగా చేసిన సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ఇవ్వాలని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడైన పీవీ.. దేశం, మాతృభాష అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. పీవీ శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటు: కేసీఆర్‌

ఉభయ సభలు నిరవధిక వాయిదా.. షెడ్యూల్​కు ముందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.