ETV Bharat / state

Police on drugs: డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ప్రత్యేక నిఘాతో అరెస్టులు

author img

By

Published : Oct 27, 2021, 5:12 AM IST

Updated : Oct 27, 2021, 5:20 AM IST

ఫుడ్ డెలీవరీ బాయ్స్ ముసుగు తొడుక్కుని కొందరు. పార్శిల్‌ బాక్స్‌లో వస్తువుల మాటున మరికొందరు. కూరగాయల చాటున ఇంకొందరు. అందరి లక్ష్యం ఒక్కటే పోలీసుల కళ్లు గప్పటం. ఎలాగైనా సరే సరుకును గమ్యానికి చేర్చటం. ఇకపై ఇలాంటి మత్తులమారి జిత్తులు సాగనీయబోమంటున్నారు పోలీసులు. మాదకద్రవ్యాల మత్తు నుంచి యువతను దూరం చేయటమే లక్ష్యంగా ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు.

police special search on drugs transport in Telangana
డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

మహిళలు ధరించే ఈ లెహంగాలను చూశారా.. పైకి ఇవి దుస్తుల్లాగా కనిపించినా వీటి లోపల కోటి రూపాయల విలువ చేసే సరుకును రహస్యంగా తరలించారంటే నమ్ముతారా..! ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కంది చేను అనుకుంటున్నారా నిజమే బయటికి కనిపించేది కంది పంటే అయినా లోపల మాత్రం గంజాయి గుప్పుమంటోంది. ఇలా అచ్చం సినిమాల్లో చూపించే విధంగా పోలీసులను బురిడీ కొట్టించేందుకు కొన్ని మాఫియాల ఆగడాలకు నిదర్శనాలివి. మత్తుపదార్థాలరహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా సర్కార్‌ నడుంబిగించటంతో పోలీసులే అవాక్కయ్యేలా మత్తులమారి ఆగడాలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్‌, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 70కి పైగా కేసులు నమోదు చేశారు.


ఆంధ్రా, ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లాలోని పలుప్రాంతాల నుంచి హైదరాబాద్​తో పాటు.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వరకు గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలోని నారాయణఖేడ్, ఆదిలాబాద్, నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ గంజాయి సాగు చేసి సరఫరా చేస్తున్నారు. తనిఖీల వేళ ఎలాంటి అనుమానం రాకుండా వాహనాల్లో పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుని బాహ్యవలయ రహదారి మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి వాహనాలు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. గత పదిహేను రోజుల నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు.


తాజాగా హైదరాబాద్‌ ఎస్​ఆర్​ నగర్ పరిధిలోని డీకే రోడ్‌లో నిషేధిత గంజాయి నుంచి తీసిన యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, జాఫర్‌పల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు గంజాయి సాగుపై దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాదకద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు.


డ్రగ్స్‌, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి తెలిస్తే 949061711కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచటంతో పాటు పోలీసుశాఖ తరఫున నజరానాలు సైతం అందించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి:
Drugs in Hyderabad: నగరంలో మరోసారి గుప్పుమన్న డ్రగ్స్‌.. 10 కోట్ల విలువైన సరకు స్వాధీనం

Last Updated : Oct 27, 2021, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.