ETV Bharat / state

Job Fraud: డేటా ఎంట్రీ జాబ్​ ఇస్తామంటూ.. నిరుద్యోగులకు టోకరా

author img

By

Published : May 1, 2023, 10:58 AM IST

Fake Call Center Case Update: ఉద్యోగాల పేరిట వందల మంది యువతీ, యువకులను మోసగించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు చక్రధర్‌ గౌడ్‌ గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అతను ఇతర రాష్ట్రాల వారిని మోసగిస్తే తన గుట్టు బయటపడదని భావించి.. పొరుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. గత మూడేళ్లుగా వేలాది మంది నిరుద్యోగుల వద్ద నుంచి రూ.5 కోట్ల మేర దండుకున్నట్టు బయటపడింది.

Fake Call Center Case
Fake Call Center Case

డేటా ఎంట్రీ జాబ్​ ఇస్తామంటూ.. నిరుద్యోగులకు టోకరా

Fake Call Center Case Update: హైదరాబాద్‌లో కాల్‌ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ముఠా ప్రధాన నిందితుడు సిద్ధిపేటకు చెందిన చక్రధర్‌ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. అతను 2008 నుంచి ఏడాది పాటు ఎల్​ఐసీ ఏజెంట్‌గా.. ఆ తర్వాత ప్రముఖ కార్పొరేట్ బ్యాంకులో వరకు పని చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ అనుభవంతోనే మోసాలకు తెరలేపాడని వెల్లడించారు.

కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి: అందుకోసం తన స్నేహితులు శ్రావణ్, గణేశ్​తో కలిసి పంజాగుట్టలో ఓ ఇంటికి నెలకు రూ.లక్షా 30 వేలు అద్దెకు తీసుకున్నాడు. తెలంగాణకు చెందిన యువతను టెలీకాలర్స్‌గా తీసుకున్నా.. మోసగించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశంతో చక్రధర్‌ కొత్త ఎత్తుగడ వేశాడు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన యువతీ, యువకులకు నెలకు రూ.15 నుంచి 25 వేల వేతనం ఇచ్చి సుమారు 32 మందిని టెలీకాలర్స్‌గా నియమించుకొని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.

కేసులో ప్రధాన నిందితుడు చక్రధర్‌ గౌడ్‌ మోసాలు చేయడంలో ఆరితేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2006లో సిద్ధిపేటలో దొంగనోట్ల తయారీ కేసు నమోదు కాగా.. 2014లో డేటా ఎంట్రీ జాబ్ ఇస్తామంటూ ముగ్గురి నుంచి రూ.3 లక్షల 30 వేలు దండుకున్నాడు. ఆ తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నాడు. ఇటీవల ఓ వివాహితపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని వివరించారు.

పథకం ప్రకారం నిందితుడు నిరుద్యోగులను మోసం: నిరుద్యోగులను మోసం చేయాలని భావించి 2018లో.. మోసాలకు తెర తీశాడు. అందుకోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేశాడు. పథకం ఫలించకపోవడంతో కార్యాలయం మూసివేశాడు. 2020లో మరోసారి మోసాలు చేసేందుకు పథకం వేశాడని పోలీసులు తెలిపారు. 2001 నుంచి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు వివరించారు. లక్ష్యంగా చేసుకున్న వారితో 45 రోజుల్లో కార్యకలాపాలు ముగించి.. తమ వద్ద ఉన్న సిమ్‌ కార్డులను విరగొట్టి పారేస్తాడని చెప్పారు.

ఇప్పటికీ 6 వేల మందిని మోసం: ఆ తర్వాత కొత్త సిమ్‌కార్డులు కొనుగోలు చేసి మరో 45 రోజుల పాటు ఇదే తరహా మోసాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికి పైగా మోసం చేశాడని పోలీసుల అంచనా. ల్యాప్‌ట్యాప్‌, మెుబైల్‌ ఫోన్‌లను పరిశీలిస్తే తప్పా.. పూర్తిస్థాయిలో ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదని పోలీసులు చెబుతున్నారు.

యువతీ, యువకులే లక్ష్యంగా చక్రధర్ మోసాలు: నిందితుడు చక్రధర్‌ నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులు తన బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోకుండా పకడ్బందీగా పథకం వేశాడని పోలీసులు చెప్పారు. నిరుద్యోగ యువత నుంచి కాజేసిన సొమ్ము వేర్వేరు పేర్లలోని ఖాతాలకు మళ్లించేవాడని గుర్తించారు. 50 శాతం ఖర్చులకు తీసుకోగా మిగిలిన 50 శాతం సొమ్మును బంధువులు, స్నేహితుల ద్వారా ‘ఫార్మర్‌ ఫస్ట్‌’ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ఖాతాలోకి పంపేవాడు.

అందరికి సాయం చేస్తూ.. సొంతూళ్లో గుర్తింపు..: 150 మంది రైతులకు ఒక్కొకరికి రూ.లక్ష సాయంగా చెక్కులు అందించాడు.. సాయం చేసే వ్యక్తిగా సొంతూళ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏప్రిల్‌లో కేవలం 25 రోజుల్లోనే 50 నుంచి 60 లక్షలు దండుకున్నట్టు దర్యాప్తులో తేలింది. పెద్దఎత్తున మోసాలకు పాల్పడిన చక్రధర్​ను కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.