ETV Bharat / state

Kodandaram: 'అకాల వర్షాలతో అన్నదాత బతుకు కుప్పకూలిపోయింది'

author img

By

Published : May 4, 2023, 5:08 PM IST

kodandaram arrested in hyderabad: వరుస అకాల వర్షాలతో అన్నదాత బతుకు కుప్పకూలిపోయిందని టీజేఎస్​ అధినేత కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఉరి వేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వైపరీత్యాలు-పంట నష్టం-పంట బీమాపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

police arrested professor kodandaram in hyderabad
సచివాలయం లోపలికి వెళ్లడానికి యత్నం.. కోదండరామ్​ను అరెస్టు చేసిన పోలీసులు

kodandaram arrested in hyderabad: రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో అన్నదాత బతుకు కుప్పకూలిపోయిందని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు-పంట నష్టం-పంట బీమాపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి, రైతు సంఘాల నేతలు సారంపల్లి మల్లారెడ్డి, విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాల నష్టం ఎలా భరించాలి..: ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టం ఎలా భరించాలి.. మళ్లీ సేద్యం ఎలా అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని కోదండరాం అన్నారు. ఉరి వేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 7న మరో తుపాన్ ఉందంటున్న దృష్ట్యా తక్షణమే బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని‌ కన్నెగంటి రవి కోరారు. రాబోయే వానాకాలంలోగా పాత అప్పులు రద్దు చేసి.. కొత్త పంట రుణాలు ఇవ్వాలని ఆకునూరు మురళి విజ్ఞప్తి చేశారు. అనంతరం.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రైతులకు పంట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యం ‌కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కోదండరాం సహా ఇతర నాయకుల అరెస్టు: ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేందుకు సచివాలయం బయలుదేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం సహా ఆకునూరు మురళి, విస్సా కిరణ్ కుమార్, ఇతర నాయకులకు అనుమతి లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నేతలు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో కోదండరాం, ఆకునూరు మురళి సహా అందరినీ అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

"వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలకు ఏప్రిల్ మొదటి వారంలోనే ధాన్యం వచ్చింది. కానీ ఆఖరి వారం దాకా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కొనుగోలు ప్రారంభమయ్యాక కూడా చాలా నత్తనడకన సాగుతోంది. రోజుకు పది లారీలు అవసరమైతే.. రోజుకో లారీ కూడా రావడం లేదు. ఆ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండి వర్షం తాకిడికి కొట్టుకుపోయింది. ఆరబెట్టుకుందామంటే వాతావరణం అనుకూలంగా లేదు. చేన్లలో ఉన్న పంట మొత్తం వర్షం తాకిడికి పనికిరాకుండా పోయింది. ఈరోజు చావు తప్ప మరో మార్గం లేదన్నట్లుగా రైతుల పరిస్థితి మారింది."-ప్రొఫెసర్ కోదండరాం

సచివాలయం లోపలికి వెళ్లడానికి యత్నం.. కోదండరామ్​ను అరెస్టు చేసిన పోలీసులు


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.