ETV Bharat / state

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోదీ కుట్ర: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Jun 14, 2022, 5:37 PM IST

Updated : Jun 14, 2022, 6:58 PM IST

REVANTH
రేవంత్‌రెడ్డి

భాజపా తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే భాజపా కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌... భాజపాపై తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోదీ కుట్ర: రేవంత్‌రెడ్డి

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక మళ్లీ నడవకుండా చేయాలనేది మోదీ కుట్ర అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడంపై హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద చేపట్టిన నిరసలో రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. భాజపా అక్రమాలను నేషనల్‌ హెరాల్డ్‌ బయటపెడుతుందని మోదీ భయమని అన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌లో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని గతంలోనే ఈడీ చెప్పిందని స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు భాజపా కుట్ర చేస్తోంది. దేశ స్వాతంత్య్రం కోసం నేషనల్ హెరాల్డ్ ప్రత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్య్ర అనంతరం అప్పులతో పత్రిక మూతపడింది. దేశాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు కాంగ్రెస్ ఊపిరి పోసి పునఃప్రారంభించింది. లాభాపేక్ష లేని యంగ్ ఇండియా సంస్థ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. భాజపా దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సుబ్రహ్మణ్య స్వామి కోర్ట్‌కు వెళ్లినా.. మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులలో ఎలాంటి అవినీతి జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం భాజపాలో మొదలైంది. అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారు. - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

నేషనల్‌ హెరాల్డ్‌ నుంచి గాంధీ కుటుంబం రూపాయి కూడా తీసుకోలేదన్నారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చి మూసేసిన కేసును మళ్లీ తెరిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది గాంధీ కుటుంబమని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. మూసివేసిన కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ చేసిన కుట్ర అని మండిపడ్డారు. 2008 నాటి కేసును మోదీ ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారని విరుచుకుపడ్డారు. ఆరోగ్యం బాగా లేని తల్లి వద్ద రాహుల్‌గాంధీ లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

రాహుల్ విచారణ 5 గంటలకు ముగించాలి.. కానీ ఈడీ ఆఫీస్‌లో 12 గంటలపాటు కూర్చొబెట్టారు. ఇది మోదీకి తగునా... ఓ ఎంపీని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి. తల్లి ఆసుపత్రిలో ఉంటే.. కుమారుడిని గంటల కొద్ది విచారణ పేరుతో ఉంచారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదు. భాజపా నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇంతకు ఇంతా.. మిత్తితో సహా చెల్లిస్తాం... అధికారం శాశ్వతం కాదు.. అధికారులు గుర్తు పెట్టుకోవాలి. 300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. తక్షణమే కేసు ఉపసంహరించుకుని.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భాజపా తీరు మారకుంటే.. ఈనెల 23న ఈడీ ఆఫీస్‌ను తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారు.- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అయితే ఈ నిరసన కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీక ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. విభేదాలు, విమర్శలు దాదాపుగా సహజం. ఆ తర్వాత అన్నీ మరిచిపోయి కలిసికట్టుగా ముందుకెళ్లిన ఉదాహరణలు అనేకం. అదే కోవలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించిన తర్వాత చెలరేగిన అసమ్మతి దాదాపుగా చల్లారుతోంది. కలిసి పనిచేసేదే లేదని భీష్మించిన కోమటిరెడ్డి, జగ్గారెడ్డి కలిసివస్తున్నారు. నిరసనలో రేవంత్‌-జగ్గారెడ్డి కలిసికట్టుగా ఒకే వేదిక పంచుకున్నారు. నేతలిద్దరూ... ముచ్చంటించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కాంగ్రెస్ అభిమానులు, శ్రేణులు మరింత జోష్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే... రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్‌ ఐటీ పరిస్థితిపై ట్విటర్‌లో స్పందించారు. బాసరలో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. భోజన వసతి లేదని.. ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట రెగ్యూలర్ వాళ్లు కేవలం 15 మందే ఉన్నారని తెలిపారు. వీసీ అసలే లేరని… ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత త్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి అంటూ.. ట్వీటారు. కేసీఆరేమో దేశాన్ని ఉద్దరించే పనిలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్!!

  • అక్కడ కనీస సౌకర్యాలు లేవు…
    భోజన వసతి లేదు…
    169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట రెగ్యూలర్ వాళ్లు కేవలం 15 మందే ఉన్నారు. వీసీ అసలే లేడు…

    ఇదీ చదువుల తల్లి బాసర సరస్వతి చెంత త్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితి.
    కేసీఆరేమో దేశాన్ని ఉద్దరించే పనిలో బిజీగా ఉన్నాడు!!

    #TheRealRGUKT pic.twitter.com/TU5GsSfNGh

    — Revanth Reddy (@revanth_anumula) June 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి :

Last Updated :Jun 14, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.