ETV Bharat / state

సమాంతర పాలన కొనసాగించలేం: హైకోర్టు

author img

By

Published : Jun 25, 2020, 5:43 AM IST

నీటి వనరుల్లో ఆక్రమణలను అనుమతించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత.. ప్రభుత్వానిదేనని తెలిపింది. సమాంతర పరిపాలన కొనసాగించలేమని స్పష్టం చేసింది. విచారణను జులై 15కు వాయిదా వేసింది.

Parallel rule cannot be maintained: High Court
సమాంతర పాలన కొనసాగించలేం: హైకోర్టు

భూములు, చెరువులు ఆక్రమించు కోవాలనుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా అంశాలకు సంబంధించి దాదాపు వందకు పైగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత.. ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. సమాంతర పరిపాలన కొనసాగించలేమని స్పష్టం చేసింది.

మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సురారంలోని కట్టమైసమ్మ చెరువు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడ చెరువులతో పాటు మూసీ ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

నీటి వనరుల్లో ఆక్రమణలను అనుమతించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. బఫర్‌ జోన్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు, జారీచేసిన నోటీసులు, తొలగించిన వాటి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోవిధంగా చెబుతోందని... శాస్త్రిపురం, టాటానగర్‌ పారిశ్రామిక ప్రాంతాలని.. అక్కడ ప్రజలే ఇళ్లు నిర్మించుకున్నారని చెబుతోందని... అక్కడ ఆవాసాల నిర్మాణాలకు ఎలా అనుమతించారని ప్రశ్నించింది. పుప్పాలగూడ సర్వే నంబరు 345లో చెరువు ఉందని నీటిపారుదల శాఖ చెబుతుండగా, సేత్వారీ ప్రకారం అక్కడ చెరువు లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని హైకోర్టు తెలిపింది. భూ వినియోగానికి సంబంధించి హెచ్‌ఎండీఏ వద్ద ఉన్న వివరాలు మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించాలని ఆదేశించింది. విచారణను జులై 15కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వ జాప్యం: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.