ETV Bharat / state

Osmania Engineering College Placements 2023 : ఇక్కడ చదివితే '100 శాతం' ప్లేస్‌మెంట్ పక్కా

author img

By

Published : Jun 10, 2023, 12:02 PM IST

OU Engineering College Placements : ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు దీటుగా ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. కంప్యూటర్‌, ఐటీ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులంతా బహుళ జాతి సంస్థల్లో ఏటా రూ.లక్షల వేతన ప్యాకేజీలు పొందుతున్నారు. కంప్యూటర్‌, ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లో 80 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి.

UCEOU
UCEOU

UCEOU Placements 2023 : ఇంజినీరింగ్ అయిపోయన విద్యార్థులు ఎలాగైనా మంచి కంపెనీలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం సాధించాలనే తపనతో ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులు ఎన్నో సంస్థలకు రెజ్యూమెలు పంపుతూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాక.. ఎందుకు రాలేదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరోపక్క అనేక సంస్థలు... సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంటాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అదనంగా హార్డ్, సాఫ్ట్‌ స్కిల్స్‌ రెండూ ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి మంచి సాఫ్ట్​వేర్ ఉద్యోగంలో స్థిరపడతారు.

Highest Placements in OU Engineering College : వీటికి తోడు ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాలంటే ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదవాలి. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావాలి. అప్పుడే రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందనే భ్రమలో పడి కొంతమంది విద్యార్థులు మధ్యలోనే తమ చదవుకు పుల్​స్టాప్ పెడుతున్నారు. ఇందుకు భిన్నంగా ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు దీటుగా ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. కంప్యూటర్‌, ఐటీ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులంతా బహుళ జాతి సంస్థల్లో ఏటా రూ.లక్షల వేతన ప్యాకేజీలు పొందుతున్నారు.

ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లోనూ ప్లేస్​మెంట్లు : గతేడాది ఇదే కళాశాలలో చదువుకున్న ఒక విద్యార్థికి మాథ్‌ వర్క్‌ అనే బహుళ జాతి సంస్థ రూ.24 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. అలాగే 66 మందికి రూ.పది లక్షలు, ఆపై వేతన ప్యాకేజీలు లభించాయి. వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కళాశాలగా ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తించింది. కంప్యూటర్‌, ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లో 80 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి.

అత్యుత్తమ ప్రమాణాలకు నిలయం : వందేళ్లలో లక్షల మంది ఇంజినీర్లను తీర్చిదిద్దిన ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్‌, సైబర్‌ చట్టాలు, కృత్రిమ మేధకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు కళాశాలలో ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఇరవైకి పైగా బహుళ జాతి సంస్థలు ప్రాంగణ నియామకాలు ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాయి. ఇప్పటికీ రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వార్షిక వేతనంతో 240 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నలుగురు విద్యార్థులకు రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వార్షిక వేతనం లభించింది. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనాన్ని 57 మంది పొందారు. డీ షా, ఒరాకిల్‌, జీఈ డిజిటల్‌, ఎన్‌సీఆర్‌, ఏడీపీ, ఫ్యాక్ట్‌సెట్‌, ఫనాటిక్స్‌, మారుతి సుజికీ కంపెనీల ప్రతినిధులు ప్రాంగణ నియామకాలకు హాజరై.. విద్యార్థుల ప్రతిభను పరీక్షించి నియామకపు పత్రాలు ఇచ్చారు.

'ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలను జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో వందలోపు నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నాం. ప్రైవేటు కళాశాలల్లో చదివితేనే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు వస్తాయన్న భావన సరికాదు. ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్స్‌, ఐటీ కోర్సులు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ ఉద్యోగం లభిస్తుందని వరుసగా రెండేళ్లు నిరూపించాం.'-ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌, ప్రిన్సిపల్‌

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.