ETV Bharat / state

విపక్షాల ప్రచార జోరు - అధికార పక్షంపై విమర్శల తూటాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 9:03 AM IST

Opposition Parties Election Campaign : రాష్ట్రంలో అధికార పార్టీని గద్దె దించేందుకు విపక్షాలు కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్తూ అధికారం ఛేజిక్కించుకునే దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. సామాజిక మాధ్యమాలు సహా.. క్షేత్రస్థాయిలోనూ గులాబీ పార్టీకి దీటుగా కాంగ్రెస్‌ ప్రచారాన్నిహోరెత్తిస్తోంది. మరోవైపు వీలైనన్ని స్థానాల్లో సత్తా చాటేలా కమలదళం కృషి చేస్తోంది.

Telangana Assembly Elections 2023
Opposition Parties Election Campaign

విపక్షాల ప్రచార జోరు- అధికార పక్షంపై విమర్శల తూటాలు

Opposition Parties Election Campaign : తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను(Congress Party) ఒక్కసారి ఆదరించమంటూ హస్తం నేతలు ఓట్లడుగుతున్నారు. ప్రజాకర్షక హామీలను జనాల్లోకి తీసుకెళ్తూ అధికార పీఠానికి బాట వేస్తున్నారు. మెదక్‌ జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో మైనంపల్లి రోహిత్‌ రావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలంలో వొడితెల ప్రణవ్‌ కుమార్‌ చేయి గుర్తుకు మద్దతివ్వాలని కోరారు.

నేడు తెలంగాణకు రాహుల్‌ గాంధీ - ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం

Telangana Assembly Elections 2023 : జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తరుగు పేరుతో దోచుకుంటున్నా పట్టించుకోని సర్కారుకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కేసీఆర్(CM KCR) పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

Congress Election Campaign : ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎమ్మెల్యే సీతక్క పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన పోయి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఓరుగల్లు పోరులో విజయం ఎవరిది- అనుభవానిదా, యువతరానిదా?

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో మురళీ నాయక్ కోలాటాల నడుమ ర్యాలీ జరిపి ప్రచారం చేశారు. అలంపూర్‌ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఇంటింటికి తిరిగారు. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్‌షో నిర్వహించారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

BJP Election Campaign : బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ప్రచార జోరు పెంచింది. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా కేంద్రమంత్రులు రాష్ట్రానికి వరుస కట్టనున్నారు. మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మిథున్‌ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి భగవంత్ కూబా ప్రచారం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ మండలంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు.

సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటల రాజేందర్ ప్రచారం ఆరంభించారు. సీఎం అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు.. తప్పితే అభివృద్ధి చేయట్లేదని మండిపడ్డారు. కేసీఆర్​ను గద్దె దింపే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా- 23 తర్వాత అగ్రనేతల విస్తృత ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.