ETV Bharat / bharat

ఓరుగల్లు పోరులో విజయం ఎవరిది- అనుభవానిదా, యువతరానిదా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 6:19 AM IST

Warangal Politics in Telangana Elections 2023 : రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే ఓరుగల్లు ఖిల్లాలో ఈసారి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మళ్లీ గెలిచి సత్తా చాటాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. కారుపార్టీ ఆధిపత్యానికి గండికొట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తితోపాటు పరకాల, మహబూబాబాద్‌ స్థానాల్లో పోటీ ఆసక్తి రేపుతోంది.

Telangana Elections 2023
Warangal Politics in Telangana Elections 2023

ఓరుగల్లు పోరులో విజయం ఎవరి దక్కుతుంది-అనుభవమా, యువతరమా

Warangal Politics in Telangana Elections 2023 : ఓటమి లేకుండా వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే. మంత్రిగా అవకాశం పొందారు. నియోజకవర్గం అంతా ఆయనకు కొట్టిన పిండే. ఇంకోవైపు రాజకీయాలకు పూర్తిగా కొత్తముఖం. అత్తస్థానంలో అనుకోకుండా బరిలోకి దిగిన కోడలు. జనగామ జిల్లా పాలకుర్తిలో.. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న యువ అభ్యర్థి యశస్వినీ రెడ్డి మధ్య పోటీ.. సర్వత్రా ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి రామ్మోహనరెడ్డి పోటీలో ఉన్నా ప్రభావం మాత్రం నామమాత్రమే.

పాలకుర్తి నియోజకవర్గంలో అపార అనుభవం, యువతరం మధ్య రసవత్తరంగా మారింది. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకొండ్ల, రాయపర్తి, తొర్రూరు, పెదవంగర మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు 2009, 2014లో తెలుగుదేశం(TDP) నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి అక్కడి నుంచి జయకేతనం ఎగురవేశారు. తాజా ఎన్నికల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్‌ల నుంచి.. మండలస్ధాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. పాలకుర్తికి చేసిన అభివృద్ధే గెలుపిస్తుందని ఎర్రబెల్లి ధీమాగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కలిసొస్తుందని ఆశిస్తున్నారు.

తెలంగాణ బరిలో 2898 మంది అభ్యర్థులు, ఉపసంహరణకు నేడే ఆఖరు

Errabelli Dayakar Rao vs Yashaswini Reddy : ఇక రాజకీయ అరంగేట్రం చేసి మంత్రిని ఢీ(BRS Vs Congress)కొంటున్న యశస్వినీ రెడ్డి.. బీటెక్ చదివారు. 26 ఏళ్ల పిన్నవయసులో పోటీకి దిగిన యువ అభ్యర్ధిగా గుర్తింపు పొందారు. అత్త ఝాన్సీకి పౌరసత్వ సమస్య వల్ల అనుకోకుండా పోటీలో దిగిన యశస్వినీరెడ్డి.. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. స్వగ్రామం తొర్రూరులో ఆసుపత్రితోపాటు పాఠశాల నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం కొంత సానుకూలం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. యువ ఓటర్ల అండతో గట్టెక్కుతానని యశస్వినీరెడ్డి భావిస్తున్నారు. కిందిస్ధాయిలో పనిచేసే క్యాడర్ లేకపోవడం, అమెరికా వెళ్లిపోతారనే ప్రచారాలు మైనస్‌గా కన్పిస్తున్నాయి.

హనుమకొండ జిల్లా పరకాలలో భారాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే రెండుసార్లు గెలిచి నియోజకవర్గంపై పట్టు సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో ఓటర్లకు వివరిస్తున్నారు. పదేళ్లలో పరకాల రూపురేఖలు మార్చానని.. ఆ పనులే గెలిపిస్తాయని ధీమావ్యక్తం చేస్తున్నారు.

Telangana Assembly Election 2023 : పరకాల కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా అనూహ్యంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి టికెట్‌ దక్కించుకున్నారు. ఇనుగాల వెంకట్రామరెడ్డి, కొండా వర్గీయుల మద్దతు తనకు లాభిస్తుందనే భరోసాతో రేవూరి ప్రజల్లోకి వెళుతున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్.. ఎన్నికలకు ముందే నియోజకవర్గాన్ని చుట్టేశారు. బీసీ బిడ్డను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కేంద్ర పథకాలను ప్రచారంలో ప్రస్తావిస్తూ ముందుకెళుతున్నారు.

పరిశోధనలో గెలిచారు ప్రజాక్షేత్రంలో నిలిచారు తెలంగాణ ఎన్నికల బరిలో పీహెచ్​డీ పట్టాదారులు

ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను మళ్లీ అధికార పార్టీ బరిలో దించింది. నియోజవకర్గంలో చేసిన అభివృద్ధికి ప్రజలు మళ్లీ పట్టం కడతారనే ధీమాతో శంకర్‌ నాయక్‌ ఉన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యేకు చేదోడువాదోడుగా కుటుంబసభ్యులు గులాబీ శ్రేణులతో కలిసి ఓట్లు అడుగుతున్నారు.

ఈసారి కాంగ్రెస్‌ వచ్చేనా : కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా డాక్టర్ మురళీ నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సుదీర్ఘంగా పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండటం, గ్యారంటీలు గెలిపిస్తాయని మురళీ నాయక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను బీజేపీ పోటీలో నిలిపింది. ప్రధాని మోదీ పథకాలతోపాటు గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం కలిసొస్తుందనే అంచనాతో హుస్సేన్‌ నాయక్‌ ఉన్నారు.

పరిశ్రమల ఖిల్లా రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల రాజకీయం రసవత్తరం

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.