Is Multi Vitamin Tablets Good: మనిషి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ కావాలి. ఇవి సరిపడా లేని సందర్భాల్లో అంటే విటమిన్లు, మినరల్స్ లోపం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం సాధారణమే. అయితే వీటిని ఆహరం రూపంలో పొందితే చాలా మంచిది. అలా కాకుండా టాబ్లెట్ల రూపంలో తీసుకునే వారి సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది. ఆరోగ్యంగా ఉండటం కోసం మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోవడం ఎంత వరకు మంచిది. ఇవి నిజంగానే మనిషి ఆయుష్షును పెంచుతాయా? వీటి వాడకం వల్ల కలిగే లాభనష్టాల గురించిన వాస్తవాలేంటి వివరంగా తెలుసుకుందాం.
విటమిన్లు, మినరల్స్ కలయికతో తయారుచేసే మిశ్రమాన్ని మల్టీ విటమిన్లుగా పరిగణిస్తాం. ఈ మల్టీ విటమిన్లను టాబ్లెట్ల రూపంలో తీసుకుంటున్నట్లయితే, కచ్చితంగా వీటిలో కనీసం మూడు రకాల విటమిన్లు లేదా మినరల్స్ ఉండి తీరతాయి. వాటిల్లో ఏ, సీ, డీ, ఈ, కే, బీ గ్రూప్ విటమిన్లు ఏవైనా కావొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉండటంతో పాటు జీవిత కాలం కూడా మెరుగవుతుందని కొందరు చెబుతుంటారు.
దీనిలో నిజమెంత?
మల్టీ విటమిన్లు తీసుకోవడం వల్ల జీవితకాలం పెరుగుతుందన్న దానికి ఇప్పటివరకూ ఎటువంటి నిరూపణ లేదు. దాదాపు 4లక్షల మందిపై 20 ఏళ్ల పాటు జరిపిన ఈ స్టడీలో మల్టీ విటమిన్లు ఆయుష్షు పెంచినట్లు ఎక్కడా రుజువు కాలేదు. పైగా వీటిని క్రమం తప్పకుండా రోజూ తీసుకున్న వారే 4శాతం ఎక్కువగా మృత్యువాతకు గురయ్యారని స్టడీల్లో బయటపడింది.
ఈ మల్టీ విటమిన్లు దీర్ఘకాలిక సమస్యలు రాకుండా కాపాడుతాయా?
విటమిన్-డీ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిపి తీసుకుంటే క్యాన్సర్, హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి రావనే విషయంపై కూడా కొందరు అధ్యయనం చేశారు. అందులో తెలిసిన విషయం ఏంటంటే? మల్టీ విటమిన్లను 5ఏళ్ల పాటు వాడిన వారిలోనూ బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ సమస్యలు కనిపించాయి. దాంతో పాటుగా విటమిన్-డీ అనేది కార్డియోవాస్క్యులర్ సమస్యలను అస్సలు తగ్గించలేకపోయిందని కూడా కనిపెట్టారు.
అలాగే విటమిన్-డీ ఉండే ట్యాబ్లెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య రాదనేది కూడా కేవలం అపోహేనని ఈ స్టడీల్లో తేలిపోయింది. వీటిని క్రమం తప్పకుండా రెండున్నర ఏళ్ల పాటు తీసుకున్న వ్యక్తుల్లో డయాబెటిస్ సమస్య ఏ మాత్రం తగ్గినట్లు కనిపించలేదట.
వీటిపై వైద్యులు ఏమన్నారంటే?
గతంలో చెప్పినట్లుగా మల్టీ విటమిన్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్లు, హార్ట్ డిసీజ్‌లు రాకుండా మాత్రం ఉండవు. పైగా కొన్ని రకాల మల్టీ విటమిన్లను దీర్ఘకాలం వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదట. తప్పనిసరి పరిస్థితుల్లో వయస్సు పైబడిన వారు, గర్భిణీలు మాత్రమే అది కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలి. సహజంగా ఆహార పదార్థాల ద్వారా వీటిని తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఇక చివరగా, ఆయువు పెంచుకోవడానికి అసలైన మార్గాలేంటంటే!
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
- ఆహారం సరైన మొత్తంలో మాత్రమే తీసుకోవడం.
- కంటికి సరిపడ నిద్ర
- బరువును నియంత్రణలో ఉంచుకోవడం
- ఒత్తిడికి దూరంగా ఉండటం
- మద్యపానం, ధూమపానం మానేయడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది! - Vitamin B12 Rich Foods
విటమిన్ 'డి' తక్కువైతే ఇన్ని సమస్యలా! సొల్యూషన్ ఏంటో తెలుసా?