పరిశోధనలో గెలిచారు ప్రజాక్షేత్రంలో నిలిచారు తెలంగాణ ఎన్నికల బరిలో పీహెచ్‌డీ పట్టాదారులు

పరిశోధనలో గెలిచారు ప్రజాక్షేత్రంలో నిలిచారు తెలంగాణ ఎన్నికల బరిలో పీహెచ్‌డీ పట్టాదారులు
PHD Graduates Are Contesting in Telangana Elections : ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి చూపించని విద్యావంతులు.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. పీజీ చేసిన వారే కాకుండా.. పీహెచ్‌డీ పట్టాదారులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి పట్టాదారుల సంఖ్య పెరిగింది. వారు ఏ వర్సిటీలో పీహెచ్‌డీ పొందారు. ఏఏ అంశాలపై పరిశోధనలు చేశారో చూద్దాం..
PhD Graduates Are Contesting in Telangana Elections : అమ్మో.. రాజకీయాలా.. మాకు అవి సరిపడవు. రాజకీయాల్లోకి మేం దిగలేం అంటూ బాగా చదువుకున్న వారిలో చాలమంది గతంలో వాటిపట్ల అనాసక్తి ప్రదర్శించే వారే ఉంటారు. విద్యావంతులు రాజకీయాలకు దూరంగా ఉంటే ఎలా.. ఇలాంటి వారే ముందుకు రాకపోతే సమాజంలో గుణాత్మక మార్పు ఎలా సాధ్యం? అంటూ ప్రజాస్వామ్యవాదులు తరచూ ప్రశ్నించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి క్రమేణా మారుతోంది. ఉన్నత విద్యావంతులూ.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 37శాతం మంది పీజీ పూర్తి చేసిన వారున్నారు. ఇద్దరు పీహెచ్‌డీ పట్టాదారులు (గాదరి కిశోర్ - తుంగతుర్తి, చెన్నమనేని రమేశ్ - వేములవాడ). వేములవాడ నుంచి పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేశ్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. ప్రస్తుతం గాదరి కిశోర్‌తో సహా పది మంది పీహెచ్‌డీ డాక్టరేట్లు ఉన్న వారు వివిధ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాలు పొందినవారే. వారికి సంబంధించిన వివరాలు.
- బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీహెచ్‌డీ పట్టాదారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), గువ్వల బాలరాజు (అచ్చంపేట), గాదరి కిశోర్ (తుంగతుర్తి), బాల్క సుమన్ (చెన్నూరు), రసమయి బాలకిషన్ (మానకొండూరు)
- కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క (ములుగు), సంపత్‌కుమార్(అలంపూర్), కోట నీలిమ(సనత్‌నగర్), గద్దర్ కుమార్తె జీవి వెన్నెల(కంటోన్మెంట్) పీహెచ్‌డీ దారులుగా ఉన్న వీరు తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
- ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్రం విభాగంలో సహాయ అచార్యురాలైనా గుమ్మడి అనురాధ ఇల్లెందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
PhD Graduates Into Telangana Politics : సీతక్క, సంపత్‌కుమార్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్‌లు గత ఎన్నికల్లో పీహెచ్‌డీ అభ్యర్థులుగా తలపడగా.. ఈసారి పీహెచ్‌డీ పట్టాదారులుగా పోటీలో నిలిచారు.
ఈ అంశాల్లో పట్టా పొందారు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. బాలరాజు- ప్రజాస్వామ్యంలో చట్టసభల అధికారాలపై, గాదరి కిశోర్ - తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా పాత్ర అంశంపై, రసమయి బాలకిషన్ - తెలంగాణ మలివిడత పోరాటంలో సాంస్కృతిక ఉద్యమం అంశంపై, బాల్కసుమన్- ఆంగ్ల భాషపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
సీతక్క- గుత్తికోయల ఆర్థిక, సామజిక పరిస్థితులు అనే అంశంపై, సంపత్‌కుమార్- మేనేజ్మెంట్ రంగంలో, నీలిమ భారత దేశంలో ఎన్నికలు- సంస్కరణలపై (దిల్లీ జేఎన్‌యూ) నుంచి పట్టా అందుకున్నారు. వెన్నెల- మహిళా సాధికారత అంశంపై పరిశోధన పూర్తి చేశారు.
