ETV Bharat / state

Omicron Cases: పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో?

author img

By

Published : Dec 17, 2021, 6:03 PM IST

Omicron Cases in Telangana: రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరోకరు ఈ కొత్త స్ట్రెయిన్​ బారినపడగా ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 8కి చేరింది. అయితే విదేశాల నుంచి వస్తున్న వారిలో టెస్టింగ్ కొరవడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ర్యాండమ్ సాంపిళ్ల సేకరణ పద్ధతి సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? కొత్తవేరియంట్​ని గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో ఇప్పుడు చూద్దాం.

Omicron Cases: పెరుగుతోన్న ఒమిక్రాన్​ కేసులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో?
Omicron Cases: పెరుగుతోన్న ఒమిక్రాన్​ కేసులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో?

Omicron Cases increased in telangana: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంగా మారింది. కేవలం నెలన్నర రోజుల్లోనే సుమారు 90 దేశాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్... ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్​లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వందకు చేరింది. డిసెంబర్ ఒకటి నుంచి తెలంగాణలోనూ కేంద్రం ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులో నిర్ధరణ పరీక్షలు నిర్వహించి వారిలో ఒమిక్రాన్ బాధితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.

నాన్​ రిస్క్​ దేశాల నుంచి వచ్చిన వారిలోనే..

Omicron Cases: ఎయిర్ పోర్టులో బంగాల్​కు చెందిన మరో బాలుడికి చేసిన పరీక్షల్లోనూ ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. సదరు బాలుడి కుటుంబం నేరుగా ఎయిర్ పోర్టు నుంచి మరో విమానంలో బంగాల్​ చేరుకున్నారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో గుర్తించిన కేసులు 9. వీరిలో కెన్యా నుంచి ముగ్గురు రాగా... దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబీ, సూడాన్, యూకే, చెక్ రిపబ్లిక్ నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఇందులో ఇద్దరు మినహా మిగతా ఏడుగురు నాన్ రిస్క్ దేశాల నుంచే రాష్ట్రానికి చేరుకున్నారు. అంటే ఎట్ రిస్క్ దేశాలతో పోలిస్తే నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారిలో అధిక మొత్తంలో ఈ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మొత్తం 90 దేశాల్లో..

'దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 8 కేసులు నిర్ధరణయ్యాయి. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణైంది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు. వైరస్ సోకిన బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆస్పత్రుల్లో చేరారు. ఒమిక్రాన్‌తో ప్రాణాపాయం లేదు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ మరణమే నమోదైంది. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళన అవసరంలేదు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడమే కూడా వ్యాప్తికి కారణం. రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారు. 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. -డీహెచ్ శ్రీనివాసరావు

కేవలం 2శాతం మందికే ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు

Omicron Variant Updates: ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్నా... భారత ప్రభుత్వం మాత్రం కేవలం 11 దేశాలను మాత్రమే రిస్క్ దేశాలుగా గుర్తించింది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి తప్పక ఎయిర్​పోర్టుల్లో వందశాతం ఆర్​టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్​గా నిర్ధరణ అయితే వారిని టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నెగెటివ్​గా వచ్చిన వారిని హోం ఐసోలేషన్​లో ఉంచి ఎనిమిది రోజుల తర్వాత మరోమారు నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారితో వ్యాప్తి పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రిస్క్ లేని దేశాల నుంచి వస్తున్న వారిలో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ర్యాండమ్​గా 2 శాతం మందికి మాత్రమే ఎయిర్ పోర్టుల్లో ఆర్​టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే 98 శాతం మందికి ఎలాంటి పరీక్షలు చేయటం లేదు. ఇక ఈ 2 శాతం మంది సైతం సాంపిళ్లు ఇచ్చి ఇళ్లకు వెళ్లిపోతున్న పరిస్థితి.

వారితోనే పొంచి ఉన్న ప్రమాదం

తీరా నాలుగు రోజుల తర్వాత జీనోం సీక్వెన్సింగ్ ఫలితాల్లో ఒమిక్రాన్​గా నిర్ధరణ అయితే బాధితులను వెతికి అధికారులు టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈలోపే నష్టం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమకు కొవిడ్ లేదన్న ధీమాతో బాధితులు హోం క్వారంటైన్ సైతం సరిగా పాటించని పరిస్థితి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది బాధితులు ఉంటే అందులో ఆరుగురు నాన్ రిస్క్ దేశాల నుంచి సేకరించిన 2 శాతం సాంపిళ్లలోని వారే. అంటే ఎట్ రిస్క్ దేశాలతో పోలిస్తే నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారితో ప్రమాదం పొంచి ఉందని నివేదికలే తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రతి ఒక్కరికి పరీక్ష నిర్వహించాలి..

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సి ఉంది. కేంద్రం గుర్తించిన రిస్క్ దేశాల నుంచి వచ్చే వారు సహా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.