ETV Bharat / state

విదేశాలను తాకిన పేపర్​ లీకేజీ కేసు.. త్వరలో మరిన్ని అరెస్టులు..!

author img

By

Published : Mar 24, 2023, 7:20 AM IST

TSPSC Paper Leakage Case Updates: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రకంపనలు విదేశాలను తాకాయి. పలువురు ప్రవాస భారతీయులు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్‌.. వారి వివరాలను ఆరా తీస్తోంది. ఈ పరీక్షలో 100కుపైగా మార్కులు వచ్చిన వారి జాబితాను పరిశీలించిన అధికారులు.. 121 మందిలో పలువురిని ఇప్పటికే విచారించారు. తాజాగా అరెస్టయిన ముగ్గురికి ఏప్రిల్‌ 4 వరకు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. రాబోయే ఒకట్రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులకు అవకాశం కనిపిస్తోంది.

TSPSC
TSPSC

విదేశాలను తాకిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రకంపనలు

TSPSC Paper Leakage Case Updates: తవ్వే కొద్దీ కొత్త కోణాలు, వరుస అరెస్టులు, ఉత్కంఠను రేపే పరిణామాలతో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో చోటుచేసుకున్న లీకేజీ వ్యవహారం ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటి వరకు కమిషన్‌ కార్యాలయ ఉద్యోగులు, రాష్ట్రానికి చెందిన పలువురిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ వ్యవహారంతో సంబంధమున్న ప్రవాస భారతీయులను ప్రశ్నించాలని భావిస్తోంది. విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు గ్రూప్‌-1 పరీక్ష రాసి వెళ్లినట్లు సిట్‌ ఒక అంచనాకు వచ్చింది.

కీలక నిందితుడైన రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు న్యూజిలాండ్‌ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు అధికారులు తేల్చారు. ఈ జాబితాలో మరికొందరు కూడా ఉన్నట్లు గుర్తించటంతో వారికీ నోటీసులు ఇచ్చి పిలిపించనున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం కఠినతరంగా రావటంతో సివిల్స్‌కు సన్నద్ధమైన అభ్యర్థులు సైతం 100 మార్కులు సాధించడమే గగనమైంది. కానీ పలువురు అభ్యర్థులకు 120 మార్కులు దాటడంతో విచారణాధికారులే విస్తుపోయారు. ఈ క్రమంలోనే వందకు పైగా మార్కులు సాధించిన వారి జాబితాను పరిశీలించగా.. ప్రవాస భారతీయుల పేర్లు బహిర్గతం కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ కేసులో తాజాగా అరెస్టైన షమీమ్‌కు గ్రూప్‌-1లో 126 మార్కులు, రమేశ్‌కు 120 మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

టీఎస్​పీఎస్సీ ఉద్యోగి అయిన షమీమ్‌కు ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కర్నూల్ జిల్లా బనగానపల్లెకు చెందిన షమీమ్‌.. మహబూబ్‌నగర్‌కు వచ్చి స్థిరపడింది. అక్కడే ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఆమె కొన్నాళ్లు భర్తతో పాటు దుబాయ్‌లో ఉంది. గతంలో ఓ సారి గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగిగా ఎంపికైన షమీమ్ ప్రస్తుతం టీఎస్​పీఎస్సీలోని గ్రూప్‌-4 సెక్షన్‌లో పని చేస్తోంది.

paper leakage case: ఈమెను సిట్ అధికారులు గత బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనకు రాజశేఖర్ రెడ్డి వాట్సప్‌లో ప్రశ్నాపత్రాన్ని పంపించినట్లు వెల్లడించింది. ఇందుకోసం తాను డబ్బులేమీ ఇవ్వలేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఆమె పాత్రపై నిర్ధారణకు రావడంతో సిట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే షమీమ్‌ ఇంట్లో సోదాలు జరిపిన సిట్ బృందం కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

టీఎస్​పీఎస్సీ ఉద్యోగుల్లో 20 మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా.. వారిలో 8 మంది ప్రాథమిక పరీక్ష అర్హత సాధించారు. ఈ 8 మందిలో ఇద్దరికి 100కు పైగా మార్కులు రాగా ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా 100 మార్కులకు పైగా సాధించిన 121 మందిలో ఇంకా ఎందరు దొంగలు ఉన్నారో తేల్చడం ఇప్పుడు సిట్ ముందున్న ప్రధాన అంశంగా మారింది. ఈ క్రమంలో విదేశాల్లోని ప్రవాస భారతీయులను రప్పించి విచారించడంతో పాటు మిగిలిన వారి పాత్రను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో విధులు నిర్వహించే శంకరలక్ష్మి డైరీ నుంచే పాస్‌వర్డ్‌ను తస్కరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాని ఆధారంగా తన కంప్యూటర్ నుంచే ఫోల్డర్లను తెరిచిన ప్రవీణ్‌ ప్రశ్నాపత్రాల ప్రతుల్ని అక్కడే జిరాక్స్ తీసినట్లు గుర్తించారు. అలా సేకరించిన హార్డ్‌కాపీలను పలువురికి ఇచ్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే కమిషన్‌లోని ఆయా కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా నివేదిక ఆధారంగా మరింత కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది.

Foreigners in Group 1 Exam: ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తొలుత అరెస్టైన 9 మంది నిందితుల 6 రోజుల కస్టడీ నిన్నటితో ముగియగా పోలీసులు వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. తాజాగా అరెస్టైన షమీమ్, రమేష్, సురేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపర్చగా.. కోర్టు వీరికి ఏప్రిల్‌ 4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వీరందరిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. మరిన్ని అంశాలపై స్పష్టత కోసం కీలక నిందితుల్ని పోలీస్ కస్టడీకి కోరేందుకు సిట్ సిద్ధమవుతోంది.

ఇవీ చదవండి:

మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల అరెస్ట్.. వారిలో ఇద్దరికి గ్రూప్‌-1లో భారీగా మార్కులు

'48 గంటల్లో తాజా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ నివేదిక ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.