ETV Bharat / state

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..? సీఎం ఆదేశించినా ఇంత నిర్లక్ష్యమా?

author img

By

Published : Sep 13, 2021, 10:10 AM IST

ఇంటి పైకెక్కి చేయి ఎత్తితే తాకే 11కేవీ లైన్లు.. ఇంటిని ఆనుకొని వేసే కరెంటు స్తంభాలు.. ఎప్పుడెప్పుడా అని బలికోరుతూ నోళ్లు వెళ్లబెట్టుకుని ఎదురుచూస్తున్న విద్యుత్తు నియంత్రికలు, ఫ్యూజ్‌ బాక్సులు. రాజధాని వ్యాప్తంగా పరిస్థితి ఇదే.

high-tension-wires
హైటెన్షన్‌ తీగలు

‘‘మే 21, 2019.. బడి ముందు ఆడుకుంటూ విద్యుదాఘాతానికి గురై దాదాపు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. మరణించాడు 14ఏళ్ల నిఖిల్‌. కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లాలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో జరిగిందీ ఘటన. ఇక్కడ చేతికందే ఎత్తులో వెళ్తున్న 11కేవీ లైను గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యుత్తు యంత్రాంగం, నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బంది.. ఇలా ఎందరిదో తప్ఫు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారించిన న్యాయస్థానం రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను తక్షణమే మార్చాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ఆదేశించింది.’’

‘‘ఇక మాటల్లేవు.. అంతా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలోని సమస్యలన్నీ పరిష్కారం కావాలి. చాలా బస్తీలపైనుంచి హైటెన్షన్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని దృష్టికొచ్చింది. పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించండి. నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..’’

-2015 మే 26న రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు

పాతబస్తీ దస్తగిరినగర్‌లో ఇళ్లపై వేలాడుతున్న తీగలు

ఇళ్లపై వేలాడుతున్న తీగలు

పాతబస్తీ దస్తగిరి నగర్​లో పాఠశాలలు, కాలనీలు, ఇళ్ల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు వెళ్తున్నాయి. వేరే సమయాల్లో ఎలా ఉన్నా వానాకాలంలో ఆవైపు వెళ్లాలంటేనే వణుకు. సీఎం ఆదేశించినా ఆ పనులు సర్వేలకే పరిమితమయ్యాయి. శాఖల నిర్లక్ష్యంతో ఏటా అభంశుభం తెలియని చిన్నారులు ఎక్కడో చోట ప్రాణాలు కోల్పోతున్నారు.

హషమాబాద్‌ టవర్‌ గల్లీలో..

ప్రమాదకరంగా లైన్లు

సర్వేలు చేసి.. చర్యలు వదిలేసి!

జనావాసాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలకు సంబంధించి గ్రేటర్‌లో దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎం ఆదేశాలతో 2015లో నివేదిక రూపొందించింది. స్వచ్ఛ హైదరాబాద్‌ కమిటీ సూచన మేరకు నియోజవర్గాల వారీగా తొలగించాల్సిన లైన్లను అందుకు అయ్యే వ్యయంతో అంచనాలు రూపొందించారు. 33కేవీ లైన్లు 119.72 కి.మీ, 11కేవీ లైన్లు 205.42 కి.మీ.గాను, ఎల్‌టీలో 402.40 కి.మీ.లు మార్చాల్సి ఉందని గుర్తించారు. ఇందుకు 248.91 కోట్లు కావాలని డిస్కం ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక ఇచ్చింది. ఇప్పుడు వీటి అంచనా వ్యయం రెట్టింపునకు చేరింది. సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి లైన్లు అక్కడే ప్రమాదకరంగా ఉన్నాయి.

అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాల ప్రహరీపై నుంచి వెళ్తున్న కేబుల్‌

ప్రహరీపై నుంచి వెళ్తున్న కేబుల్‌

తీగల కిందే నిర్మాణాలు..!

హైటెన్షన్‌ విద్యుత్తు తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దనే నిబంధనలున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యుత్తు అధికారులు సైతం తీగల కిందే వేల నిర్మాణాలు వెలుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంలో ఇప్పుడు తరచూ ఏదో ఓ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహ్మత్‌నగర్‌, కార్మికనగర్‌, పాపిరెడ్డిహిల్స్‌, బోరబండ, ఎర్రగడ్డ, బేగంపేట, కార్మికనగర్‌, బీఎస్‌ మక్తా, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోనూ హైటెన్షన్‌ విద్యుత్తు తీగల కిందే నివాసాలు వెలిసి ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఎన్ని ప్రాణాలు పోతే మారతారు..

  • కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో దీనబంధుకాలనీలోని ప్రాథమిక పాఠశాల పక్కన కంచెలేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా ఉంది. వివేకానందనగర్‌కాలనీ డివిజన్‌ పరిధి వెంకటేశ్వరనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీ లోపల వెనుక భాగంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడంతో పిల్లలను ఆడుకోవడానికి పంపాలంటే ఉపాధ్యాయులు భయపడుతున్నారు.
  • పాతనగరంలోని గౌలిపురా లలితాబాగ్‌ రోడ్డులో ఉన్న శాలిబండ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, బేరూన్‌ గౌలిపురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పక్కన కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది.
  • చాంద్రాయణగుట్ట హషమాబాద్‌ టవర్‌ గల్లీలోని నివాసాలకు సమీపంలోంచి హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు వెళ్తున్నాయి. ఇక్కడ మదర్సాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 12 ఏళ్ల మహహ్మద్‌ పతంగి ఎగురవేయడానికి మేడపైకి ఎక్కి విద్యుదాఘాతంతో ప్రాణాలు వదిలాడు.
  • ఘట్‌కేసర్‌ అన్నోజిగూడలోని ప్రభుత్వ జడ్పీ పాఠశాల ప్రహరిపై నుంచి విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు, స్తంభాలు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: Gazette Notification: నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.