ETV Bharat / state

కొత్త ఏడాదిలో భారీగా లిక్కర్ విక్రయాలు.. ప్రమాదాలకు సంకేతాలిస్తున్న అమ్మకాలు!

author img

By

Published : Dec 24, 2021, 10:14 AM IST

New Year parties 2022: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యూఇయర్ నేపథ్యంలో పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లలో జరిగే కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డిసెంబర్ 31 రాత్రి సంబరాల్లో భారీగా మద్యం తాగి.. రోడ్లపై పట్టపగ్గాలేకుండా వాహనాలు నడిపి చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని చోట్ల ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు.

New Year parties 2022
లిక్కర్ విక్రయాలు

New Year parties 2022: కొత్త ఏడాది ముంగిట మద్యం ఏరులై పారుతుంది. ముఖ్యంగా డిసెంబరు 31 రాత్రి సంబరాల్లో భారీగా మద్యం తాగుతుంటారు. ఆ మత్తులో రోడ్లపై పట్టపగ్గాలేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తమై పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగితేనే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలిగేది. ప్రస్తుతం భారీగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నా కొందరు పద్ధతి మార్చుకోవడంలేదు. 2021 నూతన సంవత్సరం సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో రూ.310 కోట్ల మద్యం విక్రయించారు. ఈసారి రూ.400 కోట్ల మేర అమ్ముడయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా.

Liquor Celebrations: కరోనా వల్ల నగరంలో 2020 మార్చి చివరి వారం నుంచి మద్యం దుకాణాలను మూసేశారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. గత ఏడాది కొత్త సంవత్సర వేడుకల సమయంలో కొంత సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. తదనుగుణంగా మద్యం అమ్మకాలు, వేడుకల విషయంలో సర్కారు కొన్ని సడలింపులు ఇస్తే ఈసారీ మద్యం విక్రయాలు భారీగా జరిగే అవకాశం ఉంది. మొత్తం 650 మద్యం షాపుల్లో పెద్దఎత్తున విక్రయించడానికి సరకు తెచ్చిపెట్టారు. బార్లు, పబ్‌లు, ఫాంహౌస్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోలీసులు చర్యలు తీసుకుంటేనే

నగరంలో కొన్ని చోట్ల ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన మందుబాబులు వేరే దారుల్లో వెళుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ విభాగంలో 2 వేల మంది పోలీసులుండగా మిగతా రెండు కమిషనరేట్లలో కలిపి మరో 2 వేల మంది ఉంటారు. వీరంతా ఇప్పటి నుంచే తనిఖీలు మొదలుపెడితేనే మందుబాబుల వీరంగానికి అడ్డుకట్టపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబరాలపై సందిగ్ధత!

నయా సాల్‌ వేడుకలకు వారం రోజులే వ్యవధి ఉండటంతో ఈవెంట్‌ సంస్థలు ఏర్పాట్లలో ఉన్నాయి. మరోవైపు కొవిడ్‌ భయాలు, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రేటర్‌లో రెండు మూడు రోజులుగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 90 దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబరాలకు ఆంక్షలతో అనుమతిస్తారా! రద్దు చేస్తారా! ప్రశ్నార్థకంగా మారింది. కొవిడ్‌ విజృంభణతో గతేడాది వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్నారు. కరోనా తగ్గి, జనజీవనం గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్‌తో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ముందు జాగ్రత్తగా క్రిస్మస్‌, జనవరి 1 వేడుకలపై ఆంక్షలు విధించాలనే యోచన ఉంది.

ఆంక్షలు తప్పవా!

నయా సాల్‌ వేడుకల అనుమతికి గ్రేటర్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈవెంట్‌ సంస్థలు, రిసార్ట్‌ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందకపోవడంతో పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లలో జరిగే కార్యక్రమాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఈవెంట్లు, పబ్‌ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ‘ప్రజలు ఆనందంగా వేడుకలు చేసుకొనేందుకు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు చెప్పరు, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచిస్తున్నామని’ సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. కోర్టు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.

2021లో హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ గణాంకాలు

  • మందుబాబులపై నమోదైన కేసులు: 25,453
  • ఛార్జిషీటు దాఖలు చేసినవి: 10,109
  • జైలుకెళ్లినవారు: 206 మంది
  • వసూలైన జరిమానా: రూ.10.49 కోట్లు

ఇదీ చూడండి: Cyberabad CP: 'నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్​కు డ్రగ్స్ రవాణా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.