ETV Bharat / state

హైదరాబాద్​లో కొత్తగా పలు డివిజన్లు.. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు

author img

By

Published : Feb 1, 2023, 7:16 PM IST

Telangana Police
Telangana Police

New Police Stations in Hyderabad: హైదరాబాద్​లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు కార్యచరణ రూపొందించారు. కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో పాటు.. బందోబస్తు విధులు సైతం పోలీసు అధికారులకు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ స్టేషన్ల పరిధిని తగ్గించి.. కొత్తగా పీఎస్​లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.

New Police Stations in Hyderabad: విస్తీర్ణం, జనాభా, కేసుల సంఖ్య ఆధారంగా గతంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దశాబ్దాల క్రితం ప్రారంభమైన పోలీస్ స్టేషన్ల పరిధిలో జనసాంద్రత పెరిగిపోయింది. దీంతో ఫిర్యాదులు, కేసుల సంఖ్య సైతం ఎక్కువైపోయాయి. రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరగడంతో... నేతల బందోబస్తులకే పోలీసులు అధిక సమయం కేటాయించాల్సి వస్తోంది. అంతే కాకుండా ముట్టడిలు, ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా చూడటం పోలీసుల విధుల్లో నిత్యం ఉంటుంది.

శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు: ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు అదనపు పనిభారం.. మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మహానగర పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్త జోన్​లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జోన్లకు డీసీపీలను కేటాయించారు. జోన్లలో డివిజన్లు, పోలీస్ స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

వీలైనంత త్వరలో పోలీస్ స్టేషన్ల ప్రారంభం: ఇప్పటికే ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. మిగతా పోలీస్ స్టేషన్లకు భవనాలు సిద్ధం చేసి వీలైనంత త్వరలో ప్రారంభించనున్నారు. సొంత భవనాలు లేనిచోట అద్దె భవనాలు లేదా.. ఇతర ప్రభుత్వ భవనాల్లో నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు.. పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. మధ్య మండల పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిధిలో దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. తూర్పు మండల పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.

చిలకలగూడ డివిజన్ పరిధిలో వారాసిగూడ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానుంది. ఉత్తర మండల పరిధిలో బేగంపేట డివిజన్ పరిధిలో తాడ్​బన్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. తిరుమలగిరి డివిజన్​ను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ తూర్పు మండల పరిధిలో.. చాంద్రాయణ గుట్ట, సైదాబాద్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బండ్లగూడ, ఐఎస్​సదన్ పీఎస్ అదనంగా అందుబాటులో రానున్నాయి.

దక్షిణ పశ్చిమ మండల పరిధిలో: దక్షిణ పశ్చిమ మండల పరిధిలో గోల్కొండ డివిజన్.. అందులో టోలిచౌకీ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానున్నాయి. కుల్సుంపుర డివిజన్, గుడిమల్కాపూర్ పీఎస్ కొత్తగా రానున్నాయి. దక్షిణ మండల పరిధిలో ఛత్రినాక డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ మండల పరిధిలో బంజారాహిల్స్ డివిజన్​లో, మాసబ్ ట్యాంక్ పీఎస్.. జూబ్లీహిల్స్ డివిజన్​, ఫిల్మ్​నగర్ పీఎస్.. ఎస్సార్​నగర్ డివిజన్, రహ్మత్​నగర్ పీఎస్, బోరబండ పీఎస్ కొత్తగా ఏర్పాటు కానున్నాయి.

రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లి, నాగోల్, గ్రీన్ ఫార్మా సిటీ పీఎస్.. పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్లు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఘట్​కేసర్, జవహార్​నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ నూతనంగా ఏర్పాటయ్యాయి. అల్లాపూర్, సూరారం, జీనోమ్ వ్యాలీ, అత్తాపూర్, కొల్లూరు, పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రాయదుర్గం ట్రాఫిక్ పీఎస్​ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చదవండి: Budget 2023 ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి ఏవి పెరుగుతాయి

'దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం'

'అమృతకాలపు బడ్జెట్.. నవ భారతానికి బలమైన పునాది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.