ETV Bharat / state

Nepali Thieves Hyderabad : నమ్మకంగా పనిలో చేరతారు.. మత్తుమందు ఇచ్చి ఇళ్లంతా దోచేస్తారు..!

author img

By

Published : Jul 13, 2023, 8:27 AM IST

Nepali Thieves
Nepali Thieves

Nepal Thieves Gang in Hyderabad : హైదరాబాద్‌లో నేపాలీల దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల ఇళ్లలో.. కాపలాదారులు, పనివాళ్లుగా చేరుతున్న నేపాలీలు... యజమాని వద్ద నమ్మకం సంపాదించుకునే వరకు వేచి చూస్తున్నారు. అవకాశం లభించగానే అందినకాడికి దోచుకెళ్తున్నారు. చేతికందిన సొమ్మును నిందితులు వాటాలుగా పంచుకొని.. నేపాల్ పారిపోతున్నారు. దీనికోసం కొన్ని ముఠాలుగా వచ్చి... దేశంలోని పలు మహానగరాల్లో ఉంటూ... అదనుచూసి చోరీలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌లో తరచూ జరుగుతూనే ఉన్న నేపాలీల దొంగతనాలు

Secunderabad Theft Case update : సికింద్రాబాద్‌లోని సింధు కాలనీలో జరిగిన చోరీలో రాంగోపాల్ పేట్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాహుల్ అనే వ్యాపారి ఇంట్లో ఐదేళ్ల క్రితం కాపలాదారుగా చేరిన కమల్ ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కమల్.. తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి... వ్యాపారి రాహుల్ ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ కాపలాదారుగా పనిచేస్తున్నాడు. రాత్రింబవళ్లు ఇంటికి కాపలా కాస్తూ యజమాని నమ్మకం చూరగొన్నాడు.

Nepali Thieves in Hyderabad : అవకాశం కోసం ఎదురు చూసిన కమల్... ఓ రోజు రాత్రి రాహుల్ కుటుంబమంతా బయటికి వెళ్లడంతో... స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నిందితులు ఇప్పటికే దేశ సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబయిలోని మధుర బస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వాళ్ల దగ్గర పెద్దగా బంగారం లభించలేదు. చోరీకి పాల్పడ్డ నిందితులు వాటాలు పంచుకొని ఎవరికి వారు... వేర్వేరుగా నేపాల్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కమల్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పట్టుకుంటే చోరీకి గురైన బంగారం ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం ఉంది.

Nepali gang Arrested in Secunderabad theft case : ఈ తరహా చోరీల క్రమాన్ని పరిశీలిస్తే... నేపాల్‌లో కొంత మంది ముఠాగా ఏర్పడి భారత్‌కు వస్తున్నారు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబయి వంటి మహానగరాల్లో తిష్ట వేస్తున్నారు. ముఠాలోని కొందరు సభ్యులు ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో పనివాళ్లను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. సంప్రదించే యజమానులకు నమ్మకం కలిగేలా... పనివాళ్లను సమకూరుస్తున్నారు. పనివాళ్లు ఎంతో కష్టపడి పనిచేస్తూ యజమాని నమ్మకం పొందుతున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలోనో... లేదా ఆహారంలో మత్తుపదార్థాలు కలిపో... దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసే సమయంలో ఇంట్లో ఉండే పనివాళ్లకు... ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠాలోని ఇతర సభ్యులు సహకరిస్తారు. పోలీసులకు చిక్కకుండా.. దోచుకున్న సొత్తుతో పరారయ్యేలా ముందే అన్నీ సిద్ధం చేసుకుంటారు. చోరీ చేసిన తర్వాత రైళ్లలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ చేరుకొని అక్కడి నుంచి సరిహద్దుల మీదుగా నేపాల్ చేరుకుంటారు.

మత్తుమందు ఇస్తారు... ఇళ్లంతా దోచేస్తారు : రెండేళ్ల క్రితం... రాయదుర్గంలో బోర్ వెల్ వ్యాపారి మధుసూధన్ రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా... చోరీకి పాల్పడింది. తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి యజమానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పెట్టారు. వారు మత్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. మాదాపూర్‌లోని టెలికాం కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా కుదిరిన నేపాలీ దంపతులు.. యజమాని కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లగా... అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి వెళ్లి 10 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. యజమాని కాపలాదారుకు ఫోన్ చేసినా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి, పక్కింటి వాళ్లకు ఫోన్ చేయడంతో చోరీ విషయం బయటపడింది.

నమ్మకంగా పనిలో చేరుతారు... అదును చూసి అందినకాడికి దోచేస్తారు : మలక్ పేట్ పరిధిలోని మూసారాంబాగ్‌లోనూ ఓ ఇంట్లో నేపాల్ ముఠా 10లక్షల రూపాయలు దోచుకెళ్లింది. అబిడ్స్‌లో బంగారం వ్యాపారి ఇంట్లో కోటి రూపాయలకుపైగా చోరీ చేసిన కమల్.. ఇందులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాచారం పరిధిలోనూ రెండేళ్ల క్రితం ఓ వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 10లక్షల నగదు, 19 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. నేరెడ్ మెట్ పీఎస్ పరిధిలోని సైనిక్ పురిలో ఓ వ్యాపారి ఇంట్లో 2కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. కుమారుడి వివాహ వేడుకలకు అందరూ ఫంక్షన్ హాల్‌కు వెళ్లగా.. పనివాళ్లుగా ఉన్న ఇద్దరు నేపాలీలు చోరీ చేశారు.

వారిని పనిలో పెట్టుకునేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి : నేపాలీలను పనిలో పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పనివాళ్లకు గతంలో ఏదైనా నేరచరిత్ర ఉందా అనే విషయం తెలుసుకోవడానికి వాళ్ల ఆధార్ కార్డులను.. పోలీస్ వెబ్ సైట్‌లోని హ్యాక్ ఐ అప్లికేషన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. పది రోజుల వ్యవధిలో సంబంధిత యజమానికి పూర్తి వివరాలు అందజేస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.