ETV Bharat / state

'14 ఏళ్లకే పెళ్లి.. ఇప్పుడు ముంబై సింగం'

author img

By

Published : Mar 30, 2022, 9:54 AM IST

Updated : Mar 30, 2022, 3:19 PM IST

పదోతరగతి కూడా పాస్‌కాకుండా ఐపీఎస్‌ అవుతానని ఎవరైనా అంటే మీరేమంటారు? నవ్వుకుంటారు కదా! తన భార్య మాటలకి ఆ కానిస్టేబుల్‌ కూడా అలానే నవ్వుకున్నాడు. కానీ ఆమె నవ్వులాటకి అనలేదని తెలిశాక తోడుగా నిలబడ్డాడు. అలా ఓ సాధారణ గృహిణి.. అంబిక ఐపీఎస్‌గా, ముంబయి సింగంగా మారింది...

Mumbai ips ambika ips story in telugu
'ఐపీఎస్​ అవుతానంటే.. ముందు టెన్త్​ పాసవ్వు అన్నారు'

అంబికది దిగువ మధ్యతరగతి కుటుంబం. భర్త తమిళనాడులోని దిండుక్కల్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌. భర్త, ఇద్దరు పిల్లలే లోకం అనుకొనే సాధారణ ఇల్లాలు ఆమె. ఓరోజు ఉదయాన్నే టిఫిన్‌ కూడా తినకుండా ఆదరాబాదరాగా పరేడ్‌కని పరుగుపెట్టాడు భర్త. అతను ఎంత సేపటికీ రాకపోయేటప్పటికి ఇద్దరు పిల్లలనీ వెంటపెట్టుకుని, ఆ టిఫిన్‌ ఇవ్వడానికి వెళ్లింది. అప్పటికింకా పరేడ్‌ పూర్తికాలేదు. దాంతో కాస్త దూరంగా నిలబడి... దాన్నే గమనిస్తోంది. ఆ సమయంలో తన భర్త అతనికంటే చిన్నవాడైన అధికారికి సెల్యూట్‌ చేయడం చూసింది. టిఫిన్‌ అయితే ఇచ్చింది కానీ భర్త తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తోందామె. కారణం అతన్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి మరి. ఇక అతను వచ్చీరాగానే ‘ఏవండీ మీరంతా వంగి వంగి నమస్కారం చేస్తున్నారే.. ఆయన ఎవరు? ఆయన మీకంటే వయసులో చిన్నకదా మీరెందుకు సెల్యూట్‌ చెయ్యాలి’ ఇలా ప్రశ్నల పరంపర వదిలిన భార్యకు సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాడతను. ‘ఆయన డీసీపీ. ఆ పక్కనే ఉన్నది ఐజీ. పెద్ద అధికారులు. మా బాస్‌లు. అందుకే సెల్యూట్‌ చేశా’ అన్నాడు. ‘అలా అయితే నేను కూడా అంత పెద్ద పోలీసవుతా!...నాకూ సెల్యూట్‌ చేస్తారా?’ అంది అంబిక. ఆ మాటలకి అతను నవ్వేసి ఊరుకున్నాడు. ‘అంత పెద్ద అధికారి కావాలంటే సివిల్స్‌ రాయాలి.

...

ముందు నువ్వు పదోతరగతి పాసవ్వు... అప్పుడు చూద్దాం’ అన్నాడు. అవును మరి అప్పటికి అంబిక పదోతరగతి కూడా పాస్‌ కాలేదు. ఎందుకంటే తనకి పద్నాలుగేళ్ల చిన్నవయసులోనే పెళ్లయ్యింది. పద్దెనిమిది వచ్చేసరికి ఇద్దరు పిల్లలు... ఐగాన్‌, నిహారిక. కుటుంబం, పిల్లలు తప్ప మరో లోకం తెలీదు. ఇప్పుడు వీళ్లని చూసుకుంటూ పదోతరగతి పాస్‌కావడం అంటే కష్టమే. కానీ ఇలాంటి కారణాలు చూపించి ‘నావల్ల కాదు’ అనుకోలేదు అంబిక. భర్త సహకారం కోరింది. అత్తింటి వాళ్లు సంశయించారు. వాళ్లనీ ఒప్పించి పదోతరగతి పరీక్షలు రాసింది. 500కి 477 మార్కులు సాధించింది. అప్పటికి కాస్త నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ప్రైవేట్‌గా బీఏ కట్టి పాసయ్యింది. అన్నీ తమిళ మీడియంలోనే. ‘ఎక్కడికి వెళ్లాలన్నా సిటీ బస్సుల్లోనే వెళ్లేదాన్ని. మేముండే దిండుక్కల్‌ బస్టాండ్‌కి దగ్గరగానే కలెక్టర్‌ బంగ్లా ఉండేది. అక్కడికి అధికారులు కార్లలో వచ్చే వాళ్లు. సైరన్ల హడావుడి. కింది స్థాయి అధికారుల సెల్యూట్లు! నాకూ అలాంటి గౌరవాల్ని దక్కించుకోవాలని ఉండేది. అందుకే సివిల్స్‌ రాయాలనుకున్నా. కానీ దిండుక్కల్‌లో సివిల్స్‌కి శిక్షణ ఇచ్చేవాళ్లు లేరు. నేను పిల్లలని చూసుకుంటాను. నువ్వు చెన్నైలో ఉండి శిక్షణ తీసుకో అన్నారు మావారు. ఆ సమయంలో దినపత్రికలు, పిల్లల పుస్తకాలు, మ్యాగజైన్లు ఏవీ వదిలేదాన్ని కాదు. పుస్తకాల పురుగులా చదివేదాన్ని’ అంటూ తన ప్రిపరేషన్‌ గురించి చెప్పుకొచ్చింది అంబిక. కానీ ఆమెని వరుస వైఫల్యాలు వెంబడించాయి. మొదటి ప్రిలిమ్స్‌లోనే వైఫల్యం. తర్వాత సారి మెయిన్స్‌ వరకూ వెళ్లి వెనుతిరిగింది. మూడోసారీ అంతే. ‘ఇప్పటికే మూడేళ్లు అయ్యాయి. పిల్లలు నిన్ను కావాలంటున్నారు. ఇక ఇంటికి వచ్చేయ్‌.. ఖాకీ బట్టలపై నీకిష్టమైన ఆ రెండు స్టార్లూ నేనే సంపాదిస్తాలే’ అన్నాడు భర్త. కానీ అంబిక మనసు ఒప్పుకోలేదు. ‘ఒకే ఒక్క ఛాన్స్‌. ఇది నా ఆఖరి ప్రయత్నం. ఈసారీ ఓడిపోతే మీరుచెప్పినట్టే ఇంటికొచ్చేస్తా. టీచర్‌ జాబ్‌ చేస్తా’ అంది. ఈసారి అంబిక కష్టం ఫలించింది. ఇంటర్వ్యూలోనూ విజయం సాధించింది. 112 ర్యాంకు. మొదటి పోస్టింగ్‌ డీసీపీగా.. నార్త్‌ ముంబయిలో. మొదటగా గంగనాపూర్‌ తాలుకాలోని పిల్లల మిస్సింగ్‌ కేసులు ఛేదించి అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత చైన్‌స్నాచింగ్‌ కేసులు. ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదించి ‘ముంబయి సింగం’ అనిపించుకుంది. ఒకప్పుడు తమిళం మాత్రమే తెలిసిన అంబిక మరాఠాతో ముంబయి ప్రజలకు దగ్గర అయ్యింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘లోకమత్‌ మహారాష్ట్రియన్‌’ పురస్కారాన్నీ, ఆయన ప్రశంసలనూ అందుకుంది. ఒక గౌరవాన్ని దక్కించుకోవడం కోసం ఓ ఇల్లాలు చేసిన ఈ పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కదూ.

Last Updated :Mar 30, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.