ETV Bharat / state

వివేకా హత్య కేసు.. అవినాష్‌ కాల్‌డేటాపై సీబీఐ ఆరా?

author img

By

Published : Jan 29, 2023, 10:21 AM IST

MP AVINESHREDDY
ఎంపీ అవినాష్​ రెడ్డి

Viveka murder Case: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా నిన్న కడప ఎంపీ అవినాష్​రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను సీబీఐ ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. అవినాష్​రెడ్డి ఆర్థిక లావాదేవీలు, కాల్​డేటాపై దాదాపు నాలుగు గంటలు విచారించింది. అనంతరం మరోసారి విచారణకు రావాల్సి ఉంటుంది సీబీఐ తెలింది.

Avinash Reddy CBI Inquiry: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కాల్‌ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీసింది. హైదరాబాద్‌ కోఠిలోని కేంద్రీయ సదన్‌లో ఉన్న సీబీఐ కార్యాలయంలో దిల్లీ నుంచి వచ్చిన బృందం ఆయనను శనివారం నాలుగున్నర గంటలకుపైగా విచారించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కార్యాలయం లోపలికి వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. దిల్లీ సీబీఐ ఎస్‌సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్‌ నేతృత్వంలోని బృందం అవినాష్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. వీడియో తీయాలని.. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులను కోరారు. అందుకు సీబీఐ నిరాకరించడంతో ఆయన ఒంటరిగానే కార్యాలయంలోనికి వెళ్లారు.

బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన విషయాలను ఇప్పుడు బహిర్గతం చేయలేనని చెప్పారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించడానికి ముందు నాడు వివేకా హత్య జరిగిన సమయంలో దర్యాప్తు చేసిన కడప పోలీసులను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి అవినాష్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఆయన వెంట వచ్చారు. తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ బృందం విచారణ ముగిసేవరకు ఇక్కడే ఉంది. అవినాష్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. విచారణ అనంతరం మరోసారి రావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ సూచించింది.

.

248 మంది వాంగ్మూలాల ఆధారంగా విచారణ: 2019 మార్చిలో వైఎస్‌ వివేకానంద హత్య జరిగింది. తొలుత గుండెపోటు మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతోంది. పలు విడతలుగా సీబీఐ దర్యాప్తు బృందాలు కడప జిల్లాకు వెళ్లి క్షేత్ర స్థాయిలో సాక్ష్యాధారాల్ని సేకరించాయి. 248 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించాయి. ఈ కేసులో అవినాష్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమైనా ఇప్పటివరకు దృష్టి సారించలేదు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే ఆయనను విచారించే యోచనలో సీబీఐ అధికారులున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వీడియో విచారణకు అంగీకరించలేదు: సీబీఐ ఇచ్చిన 160 సీఆర్‌పీసీ నోటీసుకు స్పందించి హాజరయ్యానని అవినాష్‌రెడ్డి చెప్పారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరా. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. వారి అనుమానాల్ని నివృత్తి చేశా. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా. కొంతకాలంగా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఓ వర్గం, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణ మొత్తాన్ని వీడియో తీయాలని కోరా. అందుకు సీబీఐ ఒప్పుకోలేదు. ఒంటరిగా హాజరయ్యా. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తా’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

సీబీఐ కోర్టు సమన్లు: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చేరిన వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలంటూ నిందితులైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరిలకు ఈ సమన్లు జారీ అయ్యాయి. కడప సెషన్స్‌ కోర్టు నుంచి ఇటీవల 3 పెట్టెల్లో ఎఫ్‌ఐఆర్‌తోపాటు సీబీఐ దాఖలు చేసిన రెండు అభియోగ పత్రాలు, అంతకు ముందు సిట్‌ దర్యాప్తు చేసిన పత్రాలు, దస్త్రాలు సీబీఐ కోర్టుకు అందాయి.

దర్యాప్తు అధికారులు ఇప్పటివరకూ 248 మందిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఇవన్నీ సీబీఐ కోర్టుకు చేరాయి. వీటిని పరిశీలించిన సీబీఐ కోర్టు అభియోగ పత్రం, అనుబంధ అభియోగ పత్రాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ కేసుకు ఎస్‌సీ 1/2023గా నంబరు కేటాయించింది. జైలులో ఉన్న ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌లను హైదరాబాద్‌కు జైలుకు తరలించని పక్షంలో ఇక్కడికి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. లేని పక్షంలో కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరచడానికి అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.