ETV Bharat / state

Computer Science Course : అమెరికా వెళ్లినా మనోళ్లు ఆ కోర్సుకే జై

author img

By

Published : Nov 17, 2022, 6:50 AM IST

Computer Science Course : ఈ జనరేషన్ యువత టెక్కీలు కావడానికే ఆసక్తి చూపుతున్నారు. అందుకే అందరూ ఇంజినీరింగ్ వైపే మొగ్గుతున్నారు. ముఖ్యంగా బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్‌ కోర్సులోనే చదువుతున్నారు. నాలుగేళ్లు వేరే కోర్సు చదివినా చివరకు సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో కోచింగ్ తీసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా సెటిల్ అవుతున్నారు. అలాంటి వాళ్లని చూసి ఇప్పటి అప్‌కమింగ్ జనరేషన్ ముందుగానే ప్రిపేర్ అయి కంప్యూటర్‌ సైన్స్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. ఇది కేవలం ఇండియాలోనే కాదు.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్న మన భారతీయ యువత అక్కడ కూడా సీఎఈ కోర్సుకే జై కొడుతున్నారు.

Computer Science Course
Computer Science Course

Computer Science Course : అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో అయిదోవంతుకు పైగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులోనే చేరుతున్నారు. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతుండగా...మిగిలిన కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 36.8 శాతం మంది కంప్యూటర్‌ సైన్సే చదువుతున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) విడుదల చేసిన ఓపెన్‌ డోర్స్‌-2022 నివేదిక ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది.

Demand for Computer Science Course : దాని ప్రకారం 2021-22లో అమెరికాలో అనేక దేశాలకు చెందిన 9.48 లక్షల మంది చదువుతున్నారు. వారిలో కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌)లో చేరేవారే 2 లక్షల మంది (21.10 శాతం). వారిలో చైనా నుంచి 67 వేల మంది, భారత్‌ నుంచి 73 వేల మంది ఉండటం గమనార్హం. అమెరికాలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో వేతనాలు అధికంగా ఉండటంతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల వారు కంప్యూటర్‌ సైన్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఐఎంఎఫ్‌ఎస్‌ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ చెప్పారు. మున్ముందు ఆ కోర్సులో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన తెలిపారు.

ఏటా కంప్యూటర్‌ సైన్స్‌లో చేరే వారు పెరుగుతుండటంతో ఇంజినీరింగ్‌, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. (అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌గా కాకుండా విడిగా పరిగణిస్తున్నారు). 2020-21 వరకు అమెరికాలో చేరే విదేశీ విద్యార్థుల్లో మొదటి స్థానం ఇంజినీరింగ్‌దే. తొలిసారిగా 2021-22లో ఆ స్థానాన్ని కంప్యూటర్‌ సైన్స్‌ ఆక్రమించింది. బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో చేరి వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.

మూడో వంతుకుపైగా భారతీయ విద్యార్థులు...

భారతీయ విద్యార్థుల్లో అత్యధిక శాతం కంప్యూటర్‌ సైన్స్‌లోనే చేరుతున్నారు. అమెరికాలో 1,99,182 మంది విద్యార్థులు ఉండగా వారిలో 36.8 శాతం...అంటే మూడో వంతుకు మించి గణితం, కంప్యూటర్‌ సైన్సే చదువుతున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో 29.60 శాతం, బిజినెస్‌-మేనేజ్‌మెంట్‌లో 13.30 శాతం, వైద్య విద్యలో 2.6 శాతం, ఫిజికల్‌/లైఫ్‌ సైన్సెస్‌లో 6.5 శాతం మంది ఉన్నారు. ఏటా ఇంజినీరింగ్‌లో చేరే వారి శాతం తగ్గుతుండగా...సీఎస్‌లో పెరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.