ETV Bharat / state

ATM Theft in Hyderabad : దొంగ చేతికి తాళం ఇస్తే.. మొత్తం దోచేశాడుగా..

author img

By

Published : Jun 13, 2023, 8:57 AM IST

Money Stolen From ATM In Hyderabad : విలాసాలకు అలవాటు పడి కష్టాల పాలైన జీవితం. అప్పుల పాలై అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాలం. తన చేతులతో కోట్లు తరలిస్తున్నా.. నయాపైసా తీసుకోలేని ఉద్యోగం. ఇలాంటి పరిస్థితుల్లో.. చాలీచాలని వేతనంతో ఎన్నాళ్లు పని చేయాలనుకున్నాడో.. లేక కష్టం లేకుండానే కోటీశ్వరుడిని కావొచ్చనుకున్నాడో కానీ.. నోట్ల కట్టలను మూటగట్టుకుని ఎంచక్కా చెక్కేశాడు. ఇంటికెళ్లి నోట్లు లెక్కబెట్టాలనుకున్న సమయంలో పోలీసులకు చిక్కి కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

ATM Theft In Hyderabad
ATM Theft In Hyderabad

దొంగ చేతికి తాళం ఇస్తే.. మొత్తం దోచేశాడుగా..

Man Arrested For ATM Theft in Hyderabad : దొంగ చేతిలో తాళం చెవి పెడితే ఏం జరుగుతుందో అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు కాలం మారింది. కంప్యూటర్‌ కాలంలో దొంగలు తాళం చెవుల కోసం కాకుండా పాస్‌వర్డ్‌లు ఎత్తుకెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇదే తరహా ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఏటీఎంలో డబ్బులు పెట్టే ఉద్యోగం చేసే ఓ యువకుడు.. తెలిసిన పాస్‌వర్డ్‌ సాయంతో మిషన్‌లోంచి రూ.లక్షలు కాజేశాడు.

ATM Chory In Hyderabad : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్లకు చెందిన పార్థి ప్రణయ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి.. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఏటీఎంలో డబ్బులు నింపేందుకు బ్యాంకులకు అనుబంధంగా పనిచేసే ఎన్​-సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా లిమిటెడ్‌లో కస్టోడియన్‌గా చేరాడు. సాధారణంగా ప్రతి ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఇద్దరు కస్టోడియన్లు ఉంటుండగా.. ఒకరి వద్ద ఏటీఎం తెరిచే తాళం చెవి.. మరొకరి వద్ద తాళం తెరిచాక లోపలి ఎంటర్‌ చేయాల్సిన పాస్‌వర్డ్‌ ఉంటుంది. ఇద్దరు కస్టోడియన్లు కలిసి వెళ్తేనే ఏటీఎంను తెరిచి డబ్బులు నింపేందుకు అవకాశం ఉంటుంది. కాగా.. ఉప్పల్‌ మార్గంలోని ఐసీఐసీఐ ఏటీఎంలలో డబ్బులు నింపే పనిని సంస్థ ప్రణయ్‌కు అప్పగించింది. ఇతనితో పాటు అదే మార్గంలో మరో కస్టోడియన్‌గా శ్రీనివాస్ ఉన్నారు. ప్రణయ్ వద్ద కేవలం ఏటీఎం తాళం చెవులు ఉండగా.. పాస్‌వర్డ్‌ల వ్యవహారం శ్రీనివాస్ చూసుకునేవాడు.

ATM Theft In Hyderabad : హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ప్రణయ్‌కు.. ఊళ్లో రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకుని.. తాను పనిచేసే ప్రాంతాన్ని ఇందుకు అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ఇందులో భాగంగానే తన ఆధీనంలో ఉండే బ్యాంకు డబ్బులను కాజేయాలని పథకం పన్నాడు. పాస్‌వర్డ్‌లు తనకు తెలియనందున.. కార్యాలయంలోని కంప్యూటర్‌లో ఉన్న పాస్‌వర్ట్‌లు దొంగచాటుగా సేకరించాడు. ఈ క్రమంలోనే మే 31న శ్రీనివాస్‌, ప్రణయ్ కలిసి పీర్జాదిగూడలోని ఐసీఐసీఐ ఏటీఎంలో పెద్దమొత్తంలో డబ్బును నింపారు. మరుసటి రోజు శ్రీనివాస్‌కు పని ఉండటంతో మధ్యాహ్నం విధులకు వస్తానని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన ప్రణయ్‌.. ఉదయం ఐడీ కార్డు వేసుకుని ఉద్యోగిలానే ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే దొంగిలించిన పాస్‌వర్డ్‌తో పాటు తన వద్ద ఉన్న తాళం చెవితో ఏటీఎంను తెరిచి రెండున్నర లక్షలు కాజేశాడు.

Money Stolen From ATM In Hyderabad : తొలుత తాను దొంగిలించిన డబ్బుతో ఐఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కొనుగోలు చేసిన ప్రణయ్‌.. పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండొచ్చని భావించి, తన వద్ద ఉన్న పాస్‌వర్డ్‌ సాయంతో మరిన్ని ఏటీఎంలలోనూ డబ్బులు కాజేశాడు. మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ ఏటీఎంలో రూ.32 లక్షల 8 వేలు, రామాంతపూర్‌లో రూ.10 లక్షలు, పోచారంలో లక్షన్నర, ఎల్బీనగర్ బండ్లగూడలో పదకొండున్నర లక్షలు, మీర్‌పేట్‌లోని ఏటీఎంలో రూ.లక్షా 92 వేలు దొంగిలించాడు. ఇలా.. మొత్తం ఏటీఎంలలో రూ.65 లక్షల 29 వేలను కాజేసిన ప్రణయ్‌ నగరం నుంచి పరారయ్యాడు.

హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు వెళ్లిన ప్రణయ్.. దొంగిలించిన డబ్బంతా ఓ బ్యాగులో పెట్టి, తన స్నేహితుడైన క్రాంతికుమార్‌ వద్ద ఉంచాడు. కొంత డబ్బును ఇతర వ్యక్తులకు ఇచ్చాడు. కాగా.. బ్యాంకు అధికారుల లెక్కల్లో ఏటీఎం సెంటర్‌లలోని నగదు లావాదేవీల్లో తేడా రావటంతో అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఏజెన్సీని అడగ్గా.. వారు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ప్రణయ్‌ బండారం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రణయ్‌ ఇచ్చిన సమాచారంతో గ్రామంలోని స్నేహితుడి వద్ద ఉంచిన డబ్బుతో పాటు కొనుగోలు చేసిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.