క్యాసినో కేసులో ఎల్​.రమణను విచారిస్తున్న ఈడీ... తలసాని పీఏకు నోటీసులు

author img

By

Published : Nov 18, 2022, 12:17 PM IST

ED

ED investigating MLC Ramana: క్యాసినో మాటున నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణను వేగంగా కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంపై క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌, ప్రభాకర్‌రెడ్డిలతో పాటు వారితో సంబంధం ఉన్న వారిని పిలిచి విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వచ్చే వారం విచారణకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యక్తిగత సహాయకుడు హరీశ్​కు ఈడీ నోటీసులు జారీచేసింది.

ED investigating MLC Ramana: క్యాసినో వ్యవహారంలో విచారణలో భాగంగా తెరాస ఎమ్మెల్సీ రమణ ఈడీ ఎదుట హాజరయ్యారు. క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు విచారణకు రావాలని రమణకు ఇది వరకే నోటీసులు జారీచేసింది. ఇందులో భాగంగా ఎల్‌.రమణ హైదరాబాద్‌ కార్యాలయానికి వచ్చారు. బ్యాంకు లావాదేవీలు తీసుకుని వచ్చిన ఎల్‌.రమణ... విచారణ ముగిసిన తర్వాత వివరంగా మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్లారు. మంత్రి తలసాని పీఏ హరీశ్​కు సైతం ఈడీ నోటీసులు జారీచేసింది. వచ్చే వారం ఈడీ ముందు హరీశ్‌ హాజరుకానున్నారు.

జూదం ఆడే క్రమంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో నాలుగు నెలలుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌, ప్రభాకర్‌రెడ్డిలతో పాటు వారితో సంబంధం ఉన్న వారిని పిలిచి విచారిస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని గురువారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు విచారించింది. చీకోటి ప్రవీణ్‌ వ్యాపారలావాదేవీలు పరిశీలించినప్పుడు.. గుర్నాథరెడ్డి నుంచి నిధుల బదిలీ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించగా... ఆ విషయంపై స్పష్టత కోసం విచారించినట్లు తెలుస్తోంది.

విదేశాల్లో జూదం ఆడేందుకు ఇక్కడే టోకెన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఒకవేళ డబ్బు గెలుచుకుంటే అక్కడ టోకెన్లు ఇచ్చేవారని, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నిర్వాహకులు వాటి విలువకు తగ్గ డబ్బు అందిస్తారని తెలుస్తోంది. ఆ చెల్లింపులు హవాలా తరహాలోనే జరుగుతాయని సమాచారం. ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు.. ఎంత డబ్బు గెలుచుకున్నారు. తదితర విషయాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్‌ను పిలిపించి విచారించారు. హైదరాబాద్‌లో మద్యం వ్యాపారం చేస్తున్న యుగంధర్‌కు... విదేశీ జూదంతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఎల్‌.రమణను కార్యాలయానికి పిలిచిన అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.