ETV Bharat / state

జైలులో పెడతారా పెట్టుకోండి.. దేనికైనా సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Dec 1, 2022, 10:34 AM IST

Updated : Dec 1, 2022, 12:18 PM IST

MLC KAVITHA
MLC KAVITHA

రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయనే ఈడీ, సీబీఐని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని.. భయపడేది లేదని పేర్కొన్నారు. అరెస్టు చేసి జైలులో పెట్టుకున్నా.. దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

జైలులో పెడతారా పెట్టుకోండి.. దేనికైనా సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తామని.. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారని వ్యాఖ్యానించారు. దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో కవిత సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద కవిత మాట్లాడారు.

ఈ సందర్భంగా ''దేశంలో మోదీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో భాజపా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం. మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం.

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమౌతుంది.. భయపడేదేముంది. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం తెరాస చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

ఫోన్​ ఆఫ్​ వస్తే.. అరెస్టు చేసినట్టా..? మరోవైపు తనను సీబీఐ అరెస్టు చేసిందంటూ వస్తోన్న వార్తలను హైదరాబాద్ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘నాకు ఎలాంటి నోటీసులూ రాలేదు. ఎవరో వచ్చి ఫొటో దిగితే నాకేంటి సంబంధం? మీడియాలో వస్తున్న వార్తల్లో ఊహాగానాలు తప్ప ఎలాంటి నిజం లేదు. శ్రీనివాస్‌ అనే వ్యక్తిని ఒక ఫంక్షన్‌లో కలిశాను. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఏదైనా తప్పు చేస్తే అతన్ని విచారించాలి. ఫోన్ స్విచ్ఛాఫ్‌ వస్తే అరెస్టు చేసినట్లేనా? అనారోగ్యం కారణంగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాను. సీబీఐ, ఈడీలకు తెలంగాణ నాయకులు భయపడరు’’ అని బొంతు రామ్మోహన్‌ తేల్చి చెప్పారు.

ఇవీ చూడండి..

దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు

దిల్లీ మద్యం కేసులో 36 మంది.. కల్వకుంట్ల కవిత సహా కీలక నేతలు..!

Last Updated :Dec 1, 2022, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.