ETV Bharat / state

ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే.. శాశ్వతంగా తొలగింపు: సబితా ఇంద్రారెడ్డి

author img

By

Published : Apr 4, 2023, 9:06 PM IST

Sabita Indra Reddy On SSC Exams
Sabita Indra Reddy On SSC Exams

Sabita Indra Reddy On SSC Exams: పరీక్షల నిర్వహణలో ఉద్యోగులెవరూ తప్పులు చేసినా, అక్రమాలకు పాల్పడినా ఉద్యోగాలు పోతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నిన్న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించి వరుసగా పేపర్లు బయటికి రావటంతో తెలంగాణ సర్కార్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర అధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందన్న మంత్రి.. పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్​తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Sabita Indra Reddy On SSC Exams: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదన్న మంత్రి.. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్​కే భవన్ నుంచి మంత్రి సబితా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి సమీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందన్న మంత్రి.. పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్​తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

సెల్​ఫోన్​లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దు: ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్​ఫోన్​లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.

పరీక్ష పేపర్ల రవాణ విషయంలో మరింత భద్రతా చర్యలు: పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. ఈ విషయంలో ఏ విధమైన అపోహలు, అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ల రవాణ విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పటిష్ఠంగా అమలు చేయడంతో పాటు జిరాక్స్ షాప్​లను మూసివేయించాలని అన్నారు. ఈ మేరకు ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి సబిత అభినందించారు.

అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి : ఇవాళ పదో తరగతి ప్రశ్నపత్రం వరుసగా రెండో రోజు కూడా వాట్సాప్‌లో వైరల్‌ అవడాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై ఆరా తీసిన మంత్రి సబిత.. వరంగల్‌, హనుమకొండ డీఈవోలతో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై మంత్రి స్పందిస్తూ.. నిర్వహణలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు ట్విటర్‌ వేదికగా పలు సూచనలు చేశారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.