ETV Bharat / state

Minister Niranjan Reddy: 'యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందే'

author img

By

Published : Mar 24, 2022, 6:25 PM IST

Minister Niranjan Reddy: 'యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందే'
Minister Niranjan Reddy: 'యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందే'

Minister Niranjan Reddy: తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో కనీసం తమ మాట వినలేదని వెల్లడించారు. ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రి విమర్శించారు.

'యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందే'

Minister Niranjan Reddy: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. పండిన పంటను బాధ్యత ప్రకారం కొనుగోలు చేయకుండా తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదేనని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు బా‍ధ్యత కేంద్రానికి సంక్రమించిందని పేర్కొన్నారు. యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కొనాల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని మంత్రి విమర్శించారు. పంజాబ్​, తెలంగాణలో ఒకేలా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.

అవహేళన చేసేలా మాట్లాడారు..

పంజాబ్‌లో ఒకే సీజన్‌లో ధాన్యం పండిస్తారన్న నిరంజన్‌రెడ్డి.. రెండో సీజన్‌లో గోధుమలు పండిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రాన్ని, ప్రజలను పీయూష్‌గోయల్‌ అవహేళన చేసేలా మాట్లాడారని ఆగ్రహించారు. ఈ విషయంపై అందరూ సీఎంలు, శాస్త్రవేత్తలను పిలిచి చర్చ పెట్టాలన్నారు. తమ కంటే ముందే మీడియా వద్దకు వెళ్లి పీయూష్‌ గోయల్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తానొస్తే రైతులను ఉద్ధరిస్తామని.. మోదీ గుజరాత్‌ సీఎంగా చెప్పినవే తాము ఇప్పుడు ప్రస్తావిస్తున్నామన్నారు.

పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలా..

తెలంగాణ వినతిపై కేంద్రం స్పందించలేదు. కేసీఆర్​ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమా?.. ఎందుకో చెప్పాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?. పండిన పంట కొనకుండా ఇబ్బందులు పెడతారా. పంట పెట్టుబడికి పైసా ఇవ్వకుండా మాపైనే అభాండాలా. గోదాముల్లో మురిగిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచవచ్చు కదా. -సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

భాజపానే పెంచాలని చెప్పింది..

కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డాయని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. కష్టపడి 25 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గించామన్నారు. వరి సాగు తగ్గించాలని తామంటే.. పెంచాలని భాజపా చెప్పిందని మంత్రి వెల్లడించారు. వరి వేయమన్న పెద్దమనిషి కొనుగోలు చేయించాలని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు ఇవ్వాల్సిందని ఆయన అన్నారు.

ప్రధాని సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయండి..

నిల్వ ఉన్న బియ్యం పందికొక్కులపాలు చేసే బదులు పేదలకు ఎందుకు ఇవ్వలేదు?. 2014, 2019లో రైతులకు పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 60ఏళ్లు పైబడిన రైతులకు పింఛన్‌ ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. ఉద్యమిస్తున్న రైతులను చంపి క్షమాపణ చెప్పారు. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పేరోజు కచ్చితంగా వస్తుంది. కేంద్రానిది వ్యాపారాత్మక ధోరణి మాత్రమే. వాతావరణ పరిస్థితులు ఏపీలో వేరు.. తెలంగాణలో వేరు. తెలంగాణ రైతుల సమస్య పరిష్కరించకుండా మాటలు చెబుతారా?. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయండి. -సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

సీఎంకు వివరిస్తాం..

దిల్లీలో జరిగిన పరిణామాలను సీఎంకు వివరిస్తామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. సీఎం సమీక్ష తర్వాత రైతులకు ఏం చేయాలో ప్రకటిస్తామన్నారు. పీయూష్‌గోయల్‌ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారన్న నిరంజన్​ రెడ్డి.. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎలా వినియోగించాలో కేంద్రం చూసుకోవాలని మంత్రి నిరంజన్​ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.