తన స్వదస్తూరీతో ప్రధానికి పోస్టుకార్డు రాసిన మంత్రి కేటీఆర్‌.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Oct 22, 2022, 8:41 PM IST

minister ktr letter to prime minister

KTR letter to modi: చేనేత కార్మికుల సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్‌ వినూత్న ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రధానికి లక్షలాది ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. తన స్వదస్తూరీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని పోస్టుకార్డులో డిమాండ్ చేశారు. చేనేతపై ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరూ పోస్టుకార్డు రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

KTR letter to modi: చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇవాళ తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాశానని మంత్రి చెప్పుకొచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైనే పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని ధ్వజమెత్తారు.

ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లివేసే కేంద్ర ప్రభుత్వం.. తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంలో కీలకమైన నేత కార్మికులన్నారు. మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే సాంస్కృతిక సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని నేత కార్మికులతో పాటు చేనేత ఉత్పత్తుల పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.