ETV Bharat / state

KTR Delhi Tour : 'హైదరాబాద్‌ నుంచే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం'

author img

By

Published : Jun 24, 2023, 7:16 AM IST

Minister KTR Delhi Tour Updates : దేశ రాజకీయాలకు దిల్లీనే కేంద్రమని అనుకోవద్దని.. తాము హైదరాబాద్‌లో కూర్చొని కూడా జాతీయస్థాయి రాజకీయాలు చేయగలమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ చుట్టూనే దేశ రాజకీయాలు తిరగాలనే భ్రమల్ని వదులుకోవాలన్నారు. దిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్.. విపక్షాల ఐక్యత కాదని.. ప్రజల ఐక్యత ముఖ్యమని వ్యాఖ్యానించారు. రేవంత్​రెడ్డిని థర్డ్‌గ్రేడ్‌ క్రిమినల్‌తో పోల్చిన ఆయన.. అవినీతి, కుటుంబ పాలనపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఇవాళ కేటీఆర్ భేటీకానున్నారు.

KTR
KTR

విపక్షాల ఐక్యత కాదు ప్రజల ఐక్యత కోరుకుంటున్నాం

KTR Fires on Central Government : రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై దిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అనంతరం.. విలేకరులతో ముచ్చటించారు. దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసినా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న ప్రశ్నపై స్పందించారు. దేశ రాజకీయాలు దిల్లీ కేంద్రంగానే సాగాలని అనుకోవద్దని.. తాము హైదరాబాద్‌ నుంచే చక్రం తిప్పుతామని తెలిపారు. ఇప్పటివరకు పని చేసిన ప్రధానమంత్రులందరిలో అత్యంత బలహీనుడు నరేంద్ర మోదీనేనని.. ఆయనకు అవకాశం ఇస్తే దిల్లీని కూడా గుజరాత్‌కు తరలిస్తారని వాఖ్యానించారు.

మోదీని దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది బీఆర్ఎస్​ అని కేటీఆర్ స్పష్టంచేశారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని.. కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్నాలో విపక్షాల సమావేశంపై ప్రశ్నించగా.. ‘విపక్ష పార్టీలను ఏకం చేసే రాజకీయాలు కాదు.. ప్రజలను ఏకం చేసే రాజకీయాలను తాము నమ్ముతామని చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్‌, బీజేపీలే కలిసి పనిచేస్తాయన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాల్లో హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు.

KTR fires on Congress and BJP : మేఘాలయలో గతంలో కాన్రాడ్‌ సంగ్మాకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకున్నాయని కేటీఆర్ వివరించారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి విపక్ష కూటములు ఏర్పాటు చేస్తున్నారని.. ఒకరిని దింపడానికి మరొకరితో చేతులు కలుపుతున్నారన్నారు. బీఆర్ఎస్ అలా చేయదని.. ఒకరిని దింపడానికి మరొకరిని సమర్థించాలా? ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు ఉన్నాయంటే అందుకు బాధ్యత ఇన్నేళ్లు పరిపాలించిన హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీలదేనని కేటీఆర్ దుయ్యబట్టారు.

రాష్ట్రంలో వరుసగా మూడోసారి గెలిచి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం కానున్నారని.. కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గొప్ప ఉద్యమకారుడే కాదు.. గొప్ప అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. ఒకప్పుడు వరి పండించే విషయంలో ఎక్కడో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో వరి విస్తీర్ణం పెరుగుదలపై కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు.. కేసీఆర్‌ను అడిగి తెలుసుకుంటున్నారని కేటీఆర్ వివరించారు.

ఒకటి రెండు నల్ల మచ్చలు ఎందుకు చూస్తున్నారు? : నిత్యం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి వివిధ పార్టీల నాయకులు.. హైదరాబాద్‌ వచ్చి బీఆర్​ఎస్​లో చేరుతున్నారని.. వ్యూహం ప్రకారమే తాము కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉన్నామని కేటీఆర్ వివరించారు. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై కొన్ని విమర్శలు ఉండవచ్చని.. మీరు తెల్లని గోడను చూడకుండా.. ఒకటి రెండు నల్ల మచ్చలు ఎందుకు చూస్తున్నారని? ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ.. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేయడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు ఉంటుందని తెలిపారు. అవినీతి గురించి రేవంత్‌రెడ్డి వంటి థర్డ్‌గ్రేడ్‌ క్రిమినల్‌ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ దుయ్యబట్టారు.

KTR Delhi Tour : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీలను కేటీఆర్‌ ఇవాళ కలవనున్నారు. రసూల్‌పురా వద్ద మూడు నాలుగు ఎకరాల హోం శాఖ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు.. లక్డీకాపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో రైలు ఏర్పాటు.. పటాన్‌చెరు నుంచి హయత్​నగర్‌ వరకు మెట్రో విస్తరణపై వారితో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.