ETV Bharat / state

రంజాన్ స్పెషల్ ముబారక్... ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​

author img

By

Published : Mar 21, 2023, 9:30 AM IST

Minister Koppula Eshwar Review on Ramadan: ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌ పండుగకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగ‌ల నిర్వహ‌ణ‌కు సర్కార్​ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. మాసాబ్ ట్యాంక్‌లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డిలతో కలిసి కొప్పుల ఈశ్వర్‌ వివిధ శాఖ‌ల అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

Ramadan
Ramadan

Minister Koppula Eshwar Review on Ramadan: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవనంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డిలతో కలిసి కొప్పుల ఈశ్వర్‌ వివిధ శాఖ‌ల అధికారుల‌తో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఈ ఏడాది కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లు : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగ‌ల నిర్వహ‌ణ‌కు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని కొప్పుల చెప్పారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్‌కు ముస్లిం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి అవసరమైన అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.

ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజు మసీదులలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారని, వ్యర్ధాలను వేసేందుకు ప్రత్యేక డస్ట్​బిన్‌ల‌ను ఏర్పాటు చేయాలని, ఆ వ్యర్ధాలను తరలించే విధంగా పర్యవేక్షణ జరపాలని శానిటేషన్ అధికారులను కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి రంజాన్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నెల రోజుల పాటు జరిగే రోజాల సందర్భంగా ముస్లింలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఆదేశించారు.

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్ : మరోవైపు రాష్ట్రప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. ప్రతిసారి ఏదోవిధంగా కానుకలు అందజేస్తున్న సర్కార్ ఈ దఫా కూడా గుడ్​న్యూస్ చెప్పింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు పనివేళలలో గంట పాటు వెసులుబాటు సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతిరోజూ ఉండే పనివేళల కంటే ఒక గంట ముందుగానే సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లే వెసులుబాటు కల్పించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.