ETV Bharat / state

BRS ప్రయాణంలో మీరే నా బలం.. బలగం: కేసీఆర్‌

author img

By

Published : Mar 20, 2023, 6:47 PM IST

Updated : Mar 21, 2023, 6:19 AM IST

KCR Heartfelt Message to BRS Leaders: పురిటిగడ్డపై గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని.. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పని కట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్​ పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాలపై శ్రేణులకు ఆత్మీయ సందేశం ఇచ్చిన కేసీఆర్​.. నిబద్ధత కలిగిన కార్యకర్తల కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు బీఆర్​ఎస్​ అధికార పగ్గాలు చేపట్టిందని గుర్తు చేశారు.

KCR heartfelt message to BRS Leaders
KCR heartfelt message to BRS Leaders

KCR Heartfelt Message to BRS Leaders: పురిటిగడ్డపై గులాబీ పార్టీ మరోమారు బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పని కట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఆయన ఆత్మీయ సందేశం ఇచ్చారు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన.. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదం.. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి.. 2 సార్లు తెలంగాణలో బీఆర్​ఎస్​ అధికార పగ్గాలు చేపట్టిందన్న కేసీఆర్.. పట్టుదల, అంకితభావంతో పని చేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టిన కార్యకర్తల బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా బీఆర్​ఎస్ ఎదిగిందని ప్రకటించారు.

పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ.. రికార్డులను తిరగరాసి 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి తమ పార్టీ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కష్టసుఖాల్లో కలిసి నడుస్తూ.. గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి కొండంత అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్​ఎస్​కు మాత్రం టాస్క్ అన్న కేసీఆర్.. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నట్లు వివరించారు. తెలంగాణ నేడు కుదుటపడ్డదని, కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోతున్నదని పేర్కొన్నారు.

ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యం..: ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని.. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అడిగినవీ, అడగనవీ, చెప్పినవీ, చెప్పనవీ ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచామన్న ఆయన.. ఏ వర్గాన్నీ చిన్న బుచ్చలేదని, ఏ ఒక్కరినీ విస్మరించలేదని తెలిపారు.

రాష్ట్రం బాగుంటే సరిపోదు..: రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా బాగుండాలన్న కేసీఆర్.. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు తెలివి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. విజన్, సంకల్పం లేదన్న ఆయన.. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్ధేశించి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్​ నినాదాన్ని ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన పార్టీపై కేంద్రంలోని బీజేపీ బరి తెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ తమది అన్న కేసీఆర్.. నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం, మీరే నా బలగం అని శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి..: తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ అన్న ఆయన.. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్న బీఆర్​ఎస్​ను తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు. చిల్లర, మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించబోదన్న కేసీఆర్.. తెలంగాణతో బీఆర్​ఎస్​ది పేగుబంధమని అన్నారు. పురిటిగడ్డపై గులాబీపార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంవత్సరంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పని కట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత శ్రేణుల భుజ స్కంధాలపైనే ఉందన్న కేసీఆర్.. ధర్మమే జయిస్తుందని అన్నారు.

ఇవీ చూడండి..

పంట నష్టపోయిన రైతులను పరామర్శించండి.. భరోసా ఇవ్వండి: కేటీఆర్

'రైతులకు ఇబ్బందులు ఎదురైతే కఠిన చర్యలు తప్పవు'

Last Updated : Mar 21, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.