ETV Bharat / state

పూటగడవని పరిస్థితుల్లో సొంతూళ్లకు కార్మికులు

author img

By

Published : May 11, 2020, 9:24 AM IST

బతుకు దెరువుకు నగరం చేరిన వలసజీవులు తమ సొంత ఊళ్లకు కదిలి వెళ్తున్నారు. పనిచేసేచోట పూటగడవని దుస్థితిలో ఎలాగోలా బయలుదేరుతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలిస్తుండటం వల్ల చాలామంది ఠాణాల వద్దకు చేరుతున్నారు.

migrant-laborers-are-going-to-their-own-states
పూటగడవని పరిస్థితుల్లో సొంతూళ్లకు కార్మికులు

రాష్ట్రంలో వలస కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పోలీసులు, ఇతర అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ససేమిరా అంటున్నారంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. స్వస్థలాలకు వెళ్లినా 14 రోజులు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలనే నిబంధనలతో కొద్దిశాతం ఇక్కడే ఉండేందుకు సుముఖత వ్యక్తంచేస్తున్నట్లు ఆ అధికారి స్పష్టంచేశారు.

అ.. అమ్మ.. ఆ.. ఆకలి

గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, నల్లగండ్ల, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో అధికసంఖ్యలో ఉన్న కూలీల్లో చాలా మంది బాలింతలు, గర్భిణులున్నారు. ఇటువంటి సమయంలో వారు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకుని తాము రోజూ పాలప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పనా రమేష్‌ తెలిపారు. పసి పిల్లలు పస్తులుంటే చూడలేకపోతున్నామంటూ ఆమె వివరించారు.

కడుపులోని బిడ్డకు ఊపిరి పోయాలని

లాక్‌డౌన్‌కు పదిరోజుల ముందు శ్రీకాకుళం జిల్లా నుంచి పొట్టచేతపట్టుకుని ఐదు కుటుంబాలు నగరం చేరాయి. అందులోని ఓ మహిళ గర్భిణి. ఆసుపత్రికి వెళ్దామంటే కరోనా భయం. సొంతూరు వెళ్దామంటే ఆంక్షల వలయం. ఓ వైద్యుడి సలహా ప్రకారం మందులు వాడుతున్నానని, కానీ పోషకాహారం తీసుకోలేకపోతున్నానని ఆమె కన్నీరు పెట్టుకుంది. సాయం కోరేందుకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఈ సమయంలో సొంతూరెళ్లినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనతో పూటగడిస్తే చాలని భావిస్తున్నారు. పనులు ప్రారంభిస్తే ఇక్కడే ఉంటామంటున్నారు.

కన్నవారి కోసమైనా..

నగరంలోని హోటళ్లలో పనిచేసేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు నగరానికి వచ్చారు. ముషీరాబాద్‌, నల్లకుంట, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. హోటళ్లు మూతపడడంతో వీరంతా సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఊళ్లో తల్లిదండ్రుల కోసమైనా వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఒడిశాకు చెందిన కార్మికులు ఆవేదన వెలిబుచ్చారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.