ETV Bharat / state

పెళ్లి కావాలా..! ఆగస్టు వరకూ ఆగాల్సిందే..!

author img

By

Published : May 11, 2020, 7:00 AM IST

కరోనా మహమ్మారి శుభకార్యాలనూ సైతం వదల్లేదు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలు వాయిదా పడ్డాయి. మే నెలలో పెళ్లిళ్లకు అనుమతినిచ్చినా... 20 మందికి మించి బంధువులు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం అప్పులు చేసిన వారు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతుండగా... ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు వేడుకను వాయిదా వేసుకున్నారు.

marriages-postponed-in-telangana-due-to-lockdown
ప్రభావం తగ్గినా... అప్పటివరకు ఆగాల్సిందే...

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ విధించగా... చాలామంది శుభకార్యాలను వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్​, మే నెలల్లో వేలాది వివాహాలకు పగ్గాలు పడ్డాయి. పెళ్లి కోసం అప్పులు చేసి కొందరు, ఉన్నదంతా అమ్ముకొని ఏర్పాట్లు చేసుకున్న మరికొందరు నానా అవస్థలూ పడుతున్నారు.

భూమిని అమ్మి...

జనగామ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం తనకున్న భూమిని అమ్ముకున్నారు. మరో 10 రోజుల్లో వేడుక నిర్వహించాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ వచ్చి పడింది. అనవసరంగా భూమిని తెగనమ్మి నష్టపోవాల్సి వచ్చిందని ఆయన వాపోతున్నాడు.

అప్పులు చేసి...

వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఒక యువకుడు ఏప్రిల్‌ 9న పెళ్లికి సిద్ధమయ్యాడు. ఖర్చులకు రూ.2లక్షలు అప్పుగా తెచ్చి ఏర్పాట్లు చేసుకున్నాడు. లాక్‌డౌన్‌తో వేడుక వాయిదా పడగా... ఫలితంగా రూ.2లక్షలకు వడ్డీ కడుతున్నామని తెలిపాడు. లాక్​డౌన్​ అనంతరం వివాహం చేసుకోవడానికి మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందని వాపోయాడు.

మూడు నెలలు ఎదురుచూపులే..

వివాహ ముహూర్తాలు ఎక్కువగా (వైశాఖ, జ్యేష్ఠ మాసాలు) ఏప్రిల్‌, మే నెలల్లోనే ఉంటాయి. ఆపై మూఢం వస్తుంది. జూన్‌ చివర్లో మొదలయ్యే ఆషాఢం జులై వరకు ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్లు ఉండవు. ఆగస్టు(శ్రావణం)లో ముహూర్తాలు కొన్నే ఉన్నాయి. దీంతో ఇప్పుడు వివాహాలు వాయిదా వేసుకున్నవారు మరో మూడు నెలల వరకు వేచిచూడక తప్పదు. పెళ్లిళ్లు ఆగిపోవడంతో పురోహితులు, సన్నాయి మేళం, అలంకరణ చేసేవాళ్లు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్‌ చేసేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చూడండి: గూగుల్​ డ్యుయోలో 12 మందితో గ్రూప్​ వీడియో కాలింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.