ETV Bharat / state

మూఢ నమ్మకంతో రాళ్లతో కొట్టారు... చితిలోకి నెట్టారు

author img

By

Published : Jul 23, 2020, 9:45 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కొండకూనేరు గ్రామానికి చెందిన కొందరు ఓ యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. చిల్లంగి నెపంతో బారికి అనే యువకుడిని రాళ్లతో కొట్టి చితిపైన పడేశారు.

man-kill-with-superstition-at-vijayanagaram-district-gumma-laxmi-puram
మూఢ నమ్మకంతో రాళ్లతో కొట్టారు... చితిలోకి నెట్టారు

కాలంతో పోటీపడి అభివృద్ధి పరుగుపెడుతున్న రోజుల్లోనూ గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలు వీడటం లేదు. ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జరిగిన దారుణ ఘటనే ఇందుకు నిదర్శనం. చిల్లంగి నెపంతో ఒకరిని హత్యచేసి... కాలుతున్న చితిపై వేసి తగులబెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుమ్మలక్ష్మీపురం మండలంలో నెల్లికెక్కువ పంచాయతీ కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్‌ (23) అనే యువకుడి కాలికి గాయమై... అనారోగ్యంతో ఈ నెల 11న మృతి చెందాడు. ప్రసాద్‌ మృతికి ఇదే గ్రామానికి చెందిన పల్లెరిక బారికి అలియాస్‌ మిన్నారావే కారణమని కుటుంబసభ్యులు అనుమానం పెంచుకున్నారు. ప్రసాద్‌ అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ ఇంటికి చేరుకున్నారు. కొంతసేపటి తర్వాత బారికిని శ్మశానవాటికకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి హతమార్చారు. అంతేకాకుండా మృతదేహాన్ని అప్పటికే కాలుతున్న చితిపై వేసి దహనం చేశారని ఎల్విన్‌పేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌, ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.

మేనల్లుడి ఫిర్యాదుతో వెలుగులోకి..

గొడవల కారణంగా భార్య కొన్నేళ్ల కిందట వెళ్లిపోవడంతో బారికి ఒక్కడే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో ఈ ఘటన బయటకు రాలేదు. డొంగరకెక్కువ గ్రామానికి చెందిన బారికి మేనల్లుడు వెంకటరమణ... తన మామయ్య కనిపించడంలేదంటూ వెతకడం ప్రారంభించాడు. ఈ సమాచారం తెలుసుకున్న కొండకూనేరు గ్రామస్థులు బారికిని చంపేశామని, గ్రామానికి వస్తే పెద్దల సమక్షంలో మాట్లాడుకుని రాజీ చేసుకుందామని అతనికి చెప్పారు. రాజీకి ఒప్పుకోని వెంకటరమణ ఎల్విన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదీచదవండి: రికవరీలో అగ్రస్థానంలో దిల్లీ- మూడో స్థానంలో తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.