ETV Bharat / state

Krishna Board : 'నీటి కోసం లేఖాస్త్రాలు'

author img

By

Published : Jun 23, 2022, 8:46 AM IST

కృష్ణాబోర్డు
కృష్ణాబోర్డు

Krishna Board : నీటి వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. గతేడాది వినియోగించుకోని జలాలను ఈ సంవత్సరం వాడుకొనే విషయంలో ఒక రాష్ట్రం వాదనతో ఇంకో రాష్ట్రం ఏకీభవించని పరిస్థితి నెలకొంది. దీంతో రెండు రాష్ట్రాల లేఖలను అటూ ఇటూ పంపడానికే కృష్ణాబోర్డు పరిమితమైంది.

Krishna Board : నీటి వినియోగం, గతేడాది వినియోగించుకోని జలాలను ఈ సంవత్సరం వాడుకునే విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఒక రాష్ట్రం వాదనతో ఇంకో రాష్ట్రం ఏకీభవించని పరిస్థితుల్లో వచ్చిన లేఖలను అటూ ఇటూ పంపడానికే కృష్ణాబోర్డు పరిమితమైంది. 2022-23వ నీటి సంవత్సరంలో చెరి 50 శాతం చొప్పున వినియోగించుకోవాలని తెలంగాణ కోరగా, దీనికి అంగీకరించని ఆంధ్రప్రదేశ్‌ గత ఎనిమిదేళ్లుగా ఉన్నట్లే 66:34 శాతం చొప్పున ఏపీ, తెలంగాణలు వాడుకోవాలని పేర్కొంది. గత రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన లేఖాస్త్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

39.5 టీఎంసీల నీటి విడుదలకు తెలంగాణ వినతి : నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 47.791 టీఎంసీల నీరు 2021-22లో తెలంగాణకు కేటాయించగా, వినియోగించుకోలేదని.. అది తమకే చెందుతుందంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ సోమవారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం కింద తాగు, సాగు అవసరాలకు ఆగస్టు వరకు 39.5 టీఎంసీలు కేటాయించాలని కోరారు.

గత ఏడాది వినియోగించుకోనందున ఈ ఏడాదికి క్యారీ ఓవర్‌ అయిన నీటి నుంచి కేటాయింపుగా దీన్ని భావించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు 13.5 టీఎంసీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కానీ తాగునీటికి అత్యవసరం కనుక పరిగణించవచ్చని పేర్కొన్నారు. సాగర్‌ ఎడమకాలువ కింద మరమ్మతు పనులు జరుగుతున్నందున నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని, కుడికాలువ కింద అయిదు టీఎంసీల విడుదలకు అభ్యంతరం లేదంటూనే దీన్ని కొత్తగా వచ్చే నీటి నుంచి మినహాయించుకోవాలని సూచించారు. 2022-23వ సంవత్సరంలో నీటి వినియోగం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య 66:34 శాతం తమకు సమ్మతం కాదని, 50:50 శాతం ఉండాలని స్పష్టం చేశారు.

తెలంగాణ వాదనలపై ఏపీ అభ్యంతరం : ప్రస్తుత నీటి సంవత్సరంలో నిల్వ ఉన్న నీటిని రెండు రాష్ట్రాల మధ్య 66:34 శాతంగానే పరిగణించాలని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. తెలంగాణ రాసిన లేఖను కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు పంపగా, దీనిపై ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి మంగళవారం బోర్డుకు లేఖ రాశారు. క్యారీఓవర్‌ నీటి అంశం 2020 జూన్‌ నాలుగున జరిగిన బోర్డు సమావేశంలో పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ సూచన మేరకు కేంద్ర జలసంఘం అభిప్రాయాన్ని బోర్డు కోరిందని తెలిపారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని అంగీకారానికి రావాలి తప్ప బచావత్‌ ట్రైబ్యునల్‌లోని క్లాజులను ఆధారం చేసుకోవడం సరికాదంటూ జలసంఘం పేర్కొందని గుర్తుచేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌-2 అవార్డు తుది తీర్పు ఇంకా అమలులోకి రానందున శాశ్వత పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కలిసి ట్రైబ్యునల్‌ను సంప్రదించాలని జలసంఘం సూచించిదని తెలిపారు.

2021 సెప్టెంబరు ఒకటిన జరిగిన బోర్డు సమావేశంలోనూ చర్చ జరిగిందని, ఒక సంవత్సరం వినియోగించుకోలేని నీటిని తర్వాత సంవత్సరం అడగడానికి వీల్లేదనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 150 టీఎంసీల క్యారీఓవర్‌ స్టోరేజి ఉండగా, దీనిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు. తెలంగాణ సహకరించకపోవడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం వీలు కాలేదని, ఈ ఏడాది నిర్వహణకు సంబంధించిన రూల్‌కర్వ్‌ కూడా ఖరారు కాలేదన్నారు.

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ట్రైబ్యునల్‌ అవార్డు ఏమీ పేర్కొనకపోయినా తాగు, సాగునీరు, విద్యుదుత్పత్తి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ అమలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చే వరకు బోర్డు నిర్ణయించినట్లుగా 66:34నే అమలు చేయాలని కోరారు. ఒక ఏడాది కేటాయించిన నీటిని తర్వాత సంవత్సరంలో వాడుకొనే అంశాన్ని కూడా ట్రైబ్యునల్‌కే అప్పగించాలని సూచించారు. తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడికాలువకు 10 టీఎంసీలు, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలను వెంటనే విడుదల చేయాలని బోర్డును ఈఎన్‌సీ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.