KTR London Tour : 'భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ'

author img

By

Published : May 13, 2023, 10:26 PM IST

KTR

KTR London Tour : రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు లండన్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ ఒప్పందం చేసుకోగా.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్​ కూడా ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. భారత్‌లో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్న కేటీఆర్.. కేవలం తొమ్మిదేళ్లలో విప్లవాత్మక పరివర్తనతో అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు.

భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ

KTR London Tour : యూకే పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్రానికి పలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది.

రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లండన్‌లో జరిగిన ఐడియాస్‌ ఫర్‌ ఇండియా సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలతో రాష్ట్రం తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సోదాహరణంగా పేర్కొన్నారు.

స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ : భారత్‌లో సహజవనరులతో పాటు మానవవనరులు అపారంగా ఉన్నాయని గణాంకాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. అన్నింటిని సరిగ్గా వినియోగించుకుంటే చైనా 30 ఏళ్లలో సాధించిన విజయాలను.. భారత్ 20 సంవత్సరాలలోపే సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపాధి, వ్యవస్థాపకతలో యువతకు అనేక అవకాశాలను అందించాలని పేర్కొన్నారు. భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోందని కేటీఆర్ చెప్పారు.

ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది : తెలంగాణ తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగి.. ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని కేటీఆర్ వివరించారు. రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం.. దేశ జీడీపీలో ఐదు శాతానికి దోహదం చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ మార్క్యూటెక్‌ కంపెనీలకు నిలయంగా మారిందని.. ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచిందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నప్పటికి.. పర్యావరణం పట్ల ఉన్న నిబద్ధతను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోలేదని కేటీఆర్ వివరించారు.

భారతదేశంలో తెలంగాణా తరహా ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నూతనోత్సాహంతో కూడిన భవిష్యత్తును సృష్టిస్తూ.. నాలుగో పారిశ్రామిక విప్లవంలో దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ క్రమంలోనే రైతు, యువతపై దృష్టి సారించాలని సూచించారు. ఇవన్నీ సరిగ్గా ముందుకెళ్తే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా భారత్‌ అవతరించగలదని కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు.

"తెలంగాణ తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగి.. ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం.. దేశ జీడీపీలో ఐదు శాతానికి దోహదం చేస్తోంది. హైదరాబాద్‌ మార్క్యూటెక్‌ కంపెనీలకు నిలయంగా మారింది. ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నాం." - కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి : KTR on Investment Roundtable Meeting : 'తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది'

KTR Tweet On Karnataka Result : 'తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉండగా.. కర్ణాటక ఫలితాలు రిపీట్‌ కావు'

కాంగ్రెస్​లో నయా జోష్.. ఇక ఆ రాష్ట్రాలపై దృష్టి.. నాయకుల మధ్య సయోధ్య కుదిరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.