ETV Bharat / state

KRMB Letter: శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి ఆపండి: కృష్ణా బోర్డు

author img

By

Published : Feb 11, 2022, 7:24 AM IST

KRMB Letter : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్​లోని నీటిని శ్రీశైలం జలాశయంలోకి రివర్స్ పంపింగ్ చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని రెండు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.

KRMB Letter
KRMB Letter

KRMB Letter : నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్​ఎంబీ సూచించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. 809 అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34 టీఎంసీల నీరు ఉందని... కనిష్ఠ వినియోగ మట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. కానీ, మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు కావాలని తెలంగాణ, 6 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులు పంపినట్లు కేఆర్ఎంబీ పేర్కొంది.

సాగర్​ నుంచి పంపింగ్​ చేయండి..

ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల వినతుల ప్రకారం సరిపడా తాగునీరు ఇవ్వడం సాధ్యమయ్యే పరిస్థితి లేదన్న బోర్డు... శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి కోసం మినహా విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాల కోసం నీటి వినియోగాన్ని ఆపివేయాలని స్పష్టం చేసింది. తాగునీటి అవసరాలకు సరిపడా జలాల కోసం తెలంగాణ ఆధీనంలో ఉన్న ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నాగార్జున సాగర్ నుంచి నీటిని శ్రీశైలం జలాశయానికి రివర్స్ పంపింగ్ చేసే విషయాన్ని పరిశీలించాలని కేఆర్ఎంబీ తెలిపింది. అటు నీటి అవసరాల విజ్ఞప్తులను సవరించి పంపాలని కూడా బోర్డు రెండు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఈఎన్సీలకు మరో లేఖ రాసింది.

విజ్ఞప్తుల ప్రకారం ఇవ్వలేం..

మే నెలాఖరు వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నుంచి 9.07 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. కల్వకుర్తి ద్వారా తాగునీటి కోసం మూడు టీఎంసీలు, సాగునీటి కోసం 24 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. అయితే, శ్రీశైలం జలాశయంలో 809 అడుగుల వద్ద కేవలం 34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని... రాష్ట్రాల విజ్ఞప్తుల ప్రకారం నీరు ఇవ్వలేమని కేఆర్ఎంబీ తెలిపింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకొని మే నెలాఖరు వరకు తాగు, సాగు నీటి అవసరాల కోసం విజ్ఞప్తులను సవరించి పంపాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.

ఇదీ చూడండి : కొన్నది నువ్వే.. ఉన్నది ఎవరో: స్థలం కొనుక్కున్న వారికి చుక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.