ETV Bharat / state

శబరిమల వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!

author img

By

Published : Nov 27, 2022, 12:15 PM IST

Devotees Crowd at Shabarimala : కొవిడ్‌ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు. 41 రోజుల దీక్ష చేసిన వారితో పాటు.. మాలధారణ చేయకుండా దర్శనానికి వెళ్లేవారూ ఎక్కువగానే ఉంటున్నారు. అయితే శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చిన్న పిల్లల భద్రత.. దర్శనానికి ఛార్జీలు అన్ని ఒకసారి తెలుసుకుందాం.

Ayyappaswamy Darshan
Ayyappaswamy Darshan

Devotees Crowd at Shabarimala : కొవిడ్‌ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు. 41 రోజుల దీక్ష చేసిన వారితో పాటు.. మాలధారణ చేయకుండా దర్శనానికి వెళ్లేవారూ ఎక్కువగానే ఉంటున్నారు. ఒక్క మండల కాలం (నవంబరు 16- డిసెంబరు 27)లోనే 4 కోట్ల మందికి పైగా శబరిమలకు వస్తారని అంచనా.

ఈ నేపథ్యంలో మాలధారణ చేసిన బాలలు తప్పిపోకుండా కేరళ పోలీసులు వేస్తున్న ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఈసారి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వెడల్పు తక్కువగా ఉండే కొండ ప్రాంత రహదారులపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తొలివారంలోనే రెండు భారీ ప్రమాదాలు జరగ్గా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన 40 మంది గాయపడ్డారు కూడా. అందువల్ల జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి, రావడం శ్రేయస్కరం.

వర్చువల్‌ క్యూలో నమోదు: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మండల పూజల నిమిత్తం ఈ నెల 16న తెరిచారు. డిసెంబరు 27 వరకు భక్తులు దర్శించుకోవచ్చు. మళ్లీ మకరజ్యోతి పూజల కోసం డిసెంబరు 30 నుంచి.. జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. సంక్రాంతి రోజైన జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పను దర్శించుకోవచ్చు. ఆధార్‌ నంబరుతో వర్చువల్‌ క్యూలో ఉచితంగా పేరు నమోదు చేసుకుంటే, నిర్ణీత సమయానికి దర్శనానికి వెళ్లొచ్చు. నీలక్కల్‌, పంబ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా పేరు, ఆధార్‌ నమోదు చేశాకే కొండపైకి పంపుతున్నారు.

రళ ఆర్టీసీ మేలు: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వాహనాల్లో, ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అధికంగానే ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, వ్యాన్ల వంటి చిన్న వాహనాలను పంబ వరకు..బస్సులను నీలక్కల్‌ వరకు అనుమతిస్తున్నారు. వాహనాలన్నీ పంబకు 20 కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్‌ వద్ద పార్క్‌ చేయాల్సి ఉంటుంది. భక్తులు రానుపోను ప్రయాణాల్లో పంబ - నీలక్కల్‌ మధ్య నిరంతరం అందుబాటులో ఉండే కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మేలు.

చెంగనూరు, కొట్టాయం రైల్వేస్టేషన్ల నుంచి కూడా 24 గంటలూ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న వారు, తమ డ్రైవరుకు కేరళ ఘాట్‌రోడ్లలో నడిపిన అనుభవం ఉందో, లేదో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. వాహనం సామర్థ్యాన్ని (ఫిట్‌నెస్‌) ముందే తప్పనిసరిగా పరీక్షించుకోవాలి.రైళ్లలో వెళ్లే వారు.. స్థానికంగా కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడమే క్షేమకరం.

బస్‌ఛార్జీలు ఇలా: నీలక్కల్‌-పంబ: ఏసీ బస్సు రూ.80 నాన్‌ ఏసీ రూ.50

చెంగనూరు-పంబ: నాన్‌ ఏసీ బస్సు రూ.180-225

కొట్టాయం-పంబ: నాన్‌ ఏసీ బస్సు రూ.295-424

మోకాళ్లకు క్యాప్‌ పెట్టుకోవాలి: పంబ నుంచి అయ్యప్ప సన్నిధానానికి చేరేందుకు నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తి మీదుగా ఆరు కిలోమీటర్ల మేర ఉన్న కొండ మార్గంలో కాలినడకన ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మెట్ల మార్గాన్ని విస్తరించి, ఏటవాలు శ్లాబుగా మారుస్తున్నారు. దీనివల్ల అధిక శ్రమతో పాటు, మోకాళ్లపై తీవ్ర భారం పడుతోంది. అందువల్ల మోకాళ్ల సమస్యలున్న వారు తప్పనిసరిగా నీ క్యాప్‌ ధరించడం మేలు.

డోలీ ఛార్జీ రూ.5200: నడవలేని వారి కోసం నలుగురు మనుషులు మోసుకెళ్లే డోలీలు అందుబాటులో ఉంటాయి. పంబ నుంచి సన్నిధానం వరకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చేందుకు రూ.5000 ఛార్జీని దేవస్థానం నిర్ణయించింది. రూ.200 రిజిస్ట్రేషన్‌ రుసుము అదనం. పంబ గణపతి ఆలయం దాటాక, ఈ బుకింగ్‌ కార్యాలయం ఉంటుంది. రద్దీని బట్టి, మనిషి బరువును బట్టి ఈ ఛార్జీలు బాగా మారుతున్నాయి.

చిన్న పిల్లలకు భద్రత: శబరిమల వస్తున్న 14 ఏళ్లలోపు పిల్లలకు పంబ గణపతి ఆలయం దాటాక, చేయి/మెడకు ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ట్యాగ్‌లు వేస్తున్నారు. పిల్లలు రద్దీలో తప్పిపోయినా వెంటనే కనిపెట్టేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. చిన్నారి పేరు, తీసుకువచ్చిన వ్యక్తి పేరు, వివరాలు, ఫోన్‌ నంబరు ట్యాగ్‌పై నమోదు చేస్తారు. పిల్లలు తప్పిపోతే.. వెంటనే ఫోన్‌ చేసి, అప్పగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పవర్‌బ్యాంక్‌ తీసుకెళ్లాలి.

ప్రత్యేక దర్శనాలు లేవు: మంత్రులు, ఉన్నతాధికారులతో లేఖలు తీసుకెళ్తే, గతంలో అయ్యప్ప గర్భగుడి సమీపానికి అనుమతించేవారు. ఇప్పుడది రద్దు చేశారు. ఈ ప్రత్యేక పూజలకు రుసుము కడితే, స్వామిని కనులారా దర్శనం చేసుకోవచ్చు.

గణపతి పూజ: రూ.375 (స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న మండపంపై ఈ పూజ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది.)

పుష్పార్చన: రూ.12,500 (రాత్రి 7 గంటల నుంచి 9.30 మధ్య జరుగుతుంది. ఏడుగురిని స్వామి గర్భగుడి సమీపానికి అనుమతిస్తారు. భక్తులు తీసుకెళ్లే పుష్పాలతో అర్చన చేస్తారు.) కేరళ ఆర్టీసీ టికెట్లు, శబరిమల పూజలు, అక్కడ అద్దె గదులకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.