ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' వ్యవహారం.. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

author img

By

Published : Oct 28, 2022, 7:05 AM IST

KCR is silent about the purchase of TRS MLAs: దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. ఇప్పుడు అందరి దృష్టిని తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా ఉంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలకు ఎర అంశం పై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ అంశాన్ని జాతీయస్థాయిలో లెవనెత్తే అవకాశం ఉంది.

cm kcr
సీఎం కేేసీఆర్​

KCR PLAN: తెరాస ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అందరి దృష్టి తెలంగాణపై కేంద్రీకృతం కావడంతో పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వెనక జరిగిన తతంగాన్ని దిల్లీ కేంద్రంగా జాతీయ వేదికపై బహిర్గతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఆయన త్వరలో దిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసే యత్నంపై కేసీఆర్‌ బుధవారం రాత్రి, గురువారం రోజంతా తన నివాసంలో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు తదితర ముఖ్య నేతలు సమీక్షల్లో పాల్గొన్నారు.

ఈ వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి సమగ్ర నివేదికను తయారు చేసినట్లు తెలిసింది. ఘటనపై ముఖ్యమంత్రి గురువారం విలేకరుల సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా ఆయన వ్యూహాత్మక మౌనం పాటించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం వెనక ఉన్న కీలక వ్యక్తుల తతంగాన్ని దిల్లీలో జాతీయ, అంతర్జాతీయ మీడియా ద్వారా జాతీయస్థాయిలో వెల్లడించాలని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. సంబంధిత కార్యాచరణపై గురువారం నేతలతో మంతనాలు సాగించారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంఘటనకు సంబంధించిన పక్కా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. ఆడియో, వీడియో ఫైళ్లలో నిక్షిప్తమైన సమాచారంపై ఎమ్మెల్యేలను ఆరా తీయడంతో పాటు తనకున్న విశ్వసనీయవర్గాల ద్వారా రూఢీ చేసుకునే పనిలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

పలువురు సీఎంలు, నేతల ఫోన్లు.. తెరాస ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు యత్నించిన ఘటన వెలుగుచూడడంతో బిహార్‌, తమిళనాడు, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు నీతీశ్‌కుమార్‌, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు కేసీఆర్‌కు గురువారం ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టడంపై వారు కేసీఆర్‌కు అభినందనలు తెలియజేసినట్లు తెలిసింది.

అడ్డంగా దొరికినవారు మొరుగుతూనే ఉంటారు.. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని, వాటిని పార్టీ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు అధిష్ఠానం వైఖరిని తెలియజేస్తూ గురువారం ఆయన ట్విటర్‌లో సందేశం విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నందువల్ల పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.