ETV Bharat / state

ఈ నెల 18 నుంచి రెండో విడత 'కంటివెలుగు'.. మొదటి విడతను మించేలా..!

author img

By

Published : Jan 7, 2023, 10:02 PM IST

Updated : Jan 7, 2023, 10:20 PM IST

Etv Bharat
Etv Bharat

Second Phase Kanti Velugu Programme : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటోంది.

Second Phase Kanti Velugu Programme : మొదటి దఫా కంటి వెలుగు విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో ప్రభుత్వం రెండో విడత కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మొదటి విడతలో కోటీ 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. ఈసారి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులు కేంద్రంగా కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ ఉంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో అవసరమున్న ప్రతి వ్యక్తికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం వైద్యుల సూచనతో మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తారు. జిల్లాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు జరిగింది. అయితే రెండో విడత మాత్రం 100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

పథకంలో భాగంగా 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం అవసరమైన కళ్లద్దాలను జిల్లాలకు చేరవేస్తున్నారు. కంటి పరీక్షలు చేసిన నెల రోజుల్లోపు ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత‌్తలు తీసుకుంటున్నారు.

ఇటీవలే ప్రభుత్వం 929 మంది వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా నియమించింది. వీరందరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. మంత్రుల నేతృత్వంలో మున్సిపాలిటీలు, మండల పరిషత్తుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా రేషన్ షాపులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ తేదీల్లో పరీక్షలు చేయించుకోలేని వారి కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంధత్వ నివారణలో కీలక ముందడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 7, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.