ETV Bharat / state

నగరంలో జోరుగా IPL బెట్టింగ్.. రూ.కోట్లలో చేతులు మారుతున్న డబ్బు

author img

By

Published : Apr 10, 2023, 10:29 AM IST

IPL Cricket Betting in Hyderabad : క్రికెట్​కు జెంటిల్​మెన్​ గేమ్‌గా పేరుంది. అయితే.. అంతటి గౌరవప్రదమైన క్రీడను బెట్టింగ్‌ రాయుళ్లు సొమ్ముగా మలచుకుంటున్నారు. పందేలకు అలవాటుపడి.. కొద్దిపాటి సొమ్ముతో అధిక లాభాలు వస్తాయనే ఆశతో.. యువత వేలంవెర్రిగా క్రికెట్‌ బుకీల చేతుల్లో చిక్కి బలైపోతున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ క్రికెట్‌ బెట్టింగ్‌లు.. క్రమేణా పల్లెలకూ పాకాయి. అంతటితో ఆగకుండా.. విద్యార్థుల చదువులను నాశం చేస్తున్నాయి. మధ్య తరగతి కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి.

Cricket Betting Gang Arrest
Cricket Betting Gang Arrest

IPL Cricket Betting in Hyderabad : ఒక పక్క ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేస్తుంటే.. మరోవైపు బెట్టింగ్‌ రాయుళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా జరుగుతుంటే.. రూ.కోట్లల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఆన్‌లైన్‌లో బంతి.. బంతికి పందెం కాస్తూ పందెంరాయుళ్లు విందు చేసుకుంటున్నారు. ఈ సీజన్‌ ప్రారంభంలో కాస్త స్తబ్ధుగా కనిపించిన ఈ పందెంరాయుళ్లు, ఆర్గనైజర్లు క్రమంగా కార్యకలాపాల్లో వేగం పెంచుతున్నారు. తాజాగా షాద్‌నగర్‌లో ఈ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నగర శివారు అమీన్‌పూర్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి రూ.7.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భాగ్యనగరంలోని ఈ తరహా ముఠాల కార్యకలాపాలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.

ఆన్‌లైన్‌లోకి నిర్వాహకులు..: గోడకు పెద్ద టీవీ.. దాని ముందు పదుల సంఖ్యలో బెట్టింగ్ రాయుళ్లు, నోట్ల కట్టల్ని లెక్కపెడుతూ ఆర్గనైజర్లు.. ఇదంతా ఒకప్పటి వ్యవహారం. అయితే ఇప్పుడు పోలీసుల నిఘా నేపథ్యంలో నిర్వాహకులు అంతా ఆన్‌లైన్‌లోకి మారిపోయారు. యాప్‌, కొన్ని వెబ్‌సైట్ల ద్వారా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. నిర్వాహకులు ఎక్కడో ఉండి బంతి.. బంతికి ధరను నిర్ణయిస్తారు. యాప్‌ ద్వారా బెట్టింగ్​ రాయుళ్లు పందెం కాస్తారు. ఈ బెట్టింగ్​లో మనీ గెలిచినా.. ఓడిపోయినా అంతా ఆన్‌లైన్‌ విధానంలో బదిలీ అయిపోతుంది. దీనికి సంబంధించి దాదాపు 100కు పైగా యాప్‌లు వినియోగంలో ఉన్నాయి. ఈ విధానంలో బెట్టింగ్ రాయుళ్లు, నిర్వాహకులను పట్టుకోవడం కష్టతరంగా మారుతోందని పోలీసులు చెబుతున్నారు.

ఖర్చుల కోసం బెట్టింగ్‌..: అసలు బెట్టింగ్‌ అంటే.. ఒకప్పుడు నేరగాళ్లు, బాగా మనీ సంపాదించిన వ్యక్తుల వ్యవహారంగా నడిచేది. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులూ ఈ బెట్టింగ్​ వలలో చిక్కుకుంటున్నారు. ఇందుకుగానూ వందలాది యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. యువకులే కొన్ని గ్యాంగ్​లుగా మరి ఈ బెట్టింగ్ కాస్తున్నారు. కొందరు మైనర్లు, యువత ఖర్చుల కోసం బెట్టింగ్​ వలలోకి దిగుతున్నారు. ఆర్థిక స్థోమత లేకున్నా, అత్యాశకు పోయి.. చేతులు కాల్చుకుంటున్నారు. కొందరు నిర్వాహకులు శివారులోని ఫోమ్​హౌస్​లు, రిసార్టులను అడ్డాగా చేసుకొని, మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.