ETV Bharat / state

ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఎప్పుడో.. వేల గ్రామాల్లో అసంపూర్తిగా టీ-ఫైబర్‌ పనులు

author img

By

Published : May 24, 2022, 4:24 AM IST

రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం అందించాలన్న ఆశయం ముందుకు సాగడం లేదు. టీ-ఫైబర్‌ ప్రాజెక్టును ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా వాటి ఫలాలు ప్రజలకు అందడం లేదు.

టీ-ఫైబర్‌
టీ-ఫైబర్‌

డిజిటల్‌ తెలంగాణ లక్ష్యంలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్‌, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం అందించాలన్న ఆశయం నెరవేరడంలేదు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానంతో పాటు కోటి కుటుంబాలకు చౌకధరల్లో బ్రాడ్‌బ్యాండ్‌ అందించేందుకు ‘టీ-ఫైబర్‌’ ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా వాటి ఫలాలు ప్రజలకు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాల్లో పనులు చేపట్టగా సగం గ్రామాల్లోనూ సాంకేతిక మౌలిక సదుపాయాలు పూర్తికాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంత సమయం పట్టనుందో తెలియడంలేదు.

చాలా గ్రామాల్లో కొలిక్కిరాని సాంకేతిక పనులు

ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)కు అనుమతి లభించిన వెంటనే ప్రారంభించినా పనుల్లో ప్రగతి మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తుండటంతో అవి నిదానంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2,243 గ్రామాల్లో పూర్తిస్థాయి డేటా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 3,850 గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల పరికరాల రక్షణ, భద్రత చర్యలు పూర్తయ్యాయి.

ఇంకా వేలాది గ్రామాల్లో అనుసంధానం కోసం సాంకేతిక పనులు పూర్తికావాల్సి ఉంది. మరో 20 శాతం కేబుల్‌ నిర్మాణ పనులు పూర్తయితే ‘రింగు కనెక్టివిటీ’ కింద కేబుల్‌ తెగినప్పటికీ అంతరాయం లేకుండా అనుసంధానత అందించేందుకు వీలవుతుంది. ఈ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు నానక్‌రామ్‌గూడలో నెట్‌వర్క్‌ ఆపరేటింగ్‌ సెంటర్‌(ఎన్‌వోసీ) పనులు పూర్తికావాల్సి ఉంది.

యూనివర్సల్‌ లైసెన్సు వస్తే...

రాష్ట్రంలో ఇప్పటికే 5 వేలకు పైగా గ్రామాల్లో సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించాం. అక్కడ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా(పైలెట్‌ ప్రాజెక్టు కింద) సంక్షేమ గురుకులాలు, గిరిజన పాఠశాలల్లో కొన్నిచోట్ల ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. గ్రామ పంచాయతీలను అనుసంధానం చేయాలన్నా, ఇతరులకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నా కేంద్ర టెలికంశాఖ నుంచి యూనివర్సల్‌ లైసెన్సు మంజూరు కావాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. ఈ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్నాం. అది వచ్చిన వెంటనే విడతల వారీగా గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పిస్తాం. విద్యాలయాలు, ఆసుపత్రులు తదితర విభాగాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు అవసరమైన సామర్థ్యంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ అందిస్తాం.

లక్ష్యానికి దూరంగా..

బ్రాడ్‌బ్యాండ్‌ ప్రాజెక్టుతో గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలకమార్పులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావన. ఇందులో భాగంగా ఇంటింటికీ 20 ఎంబీపీఎస్‌, విద్యాలయాలకు ఒక జీబీపీఎస్‌ కనీస వేగం కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను తక్కువ ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారత్‌నెట్‌లో భాగంగా రాష్ట్రంలో రూ.3,600 కోట్ల ఖర్చుతో టీ-ఫైబర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేకంగా తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, జిల్లాల వారీగా మూడు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి ఎల్‌అండ్‌టీ, స్టెరిలైట్‌, టీసీఐఎల్‌ సంస్థలకు అప్పగించింది. ప్రాజెక్టులో భాగంగా మిషన్‌ భగీరథ పైపులైన్లతో పాటు కేబుల్‌ వేయాలని నిర్ణయించినప్పటికీ, కరోనాతో కొన్ని చోట్ల పనులు నెమ్మదించాయి. - సుజయ్‌ కారంపూరి, ఎండీ, టీ-ఫైబర్‌

ఇదీ చదవండి: ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన

విదేశాల్లో చదవాలనుందా..? చండీగఢ్ యూనివర్సిటీలో చేరండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.