ETV Bharat / state

భాగ్యనగరానికి కొత్తందాలు.. మరిన్ని పర్యాటక సొబగులు

author img

By

Published : Jan 27, 2023, 8:52 AM IST

HMDA on New Tourists Projects : హైదరాబాద్​కు వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా హెచ్​ఎండీఏ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హుస్సేన్​సాగర్ చుట్టూ సరికొత్త సొబగులను అద్దుతోంది. అవుటర్ రింగు రోడ్డుకే కొత్తరూపు తెచ్చేలా సైకిల్ ట్రాక్​ల నిర్మాణాన్ని చేపట్టింది.

Hyderabad
Hyderabad

HMDA on New Tourists Projects : భాగ్యనగరానికి మరిన్ని పర్యాటక సొబగులు జత చేరనున్నాయి. నగరానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ప్రాజెక్టులతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ముందుకు వస్తోంది. హుస్సేన్‌సాగర్‌ వద్ద ఫిబ్రవరి 11న అంతర్జాతీయ ఫార్ములా-ఈ పోటీలు జరగనున్న దృష్ట్యా.. సాగర్‌ చుట్టూ కొత్త అందాలు అద్దుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సాగర్‌లో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో అందుబాటులోకి తెచ్చేందుకు పనులు సాగుతున్నాయి. తాజాగా నెక్లెస్‌రోడ్డులో వేలాడే వంతెన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అవుటర్‌పై కూడా సైకిల్‌ ట్రాక్‌ పనులు తుదిదశకు చేరాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

అవుటర్‌కే కొత్తరూపు.. తొలి విడతలో 23 కిలోమీటర్లలో చేపడుతున్న సైకిల్‌ ట్రాక్‌ అవుటర్‌కే కొత్త రూపు తీసుకొస్తోంది. తొలుత నానక్‌రాంగూడ నుంచి టీఎస్‌పీఎస్‌ వరకు 8.50 కిలోమీటర్లు.. నార్సింగ్‌ నుంచి కొల్లూరు వరకు మరో 14.50 కిలోమీటర్ల మేరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 15 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌ 4.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండు వైపులా 1 మీటర్‌ వెడల్పుతో పచ్చదనం కోసం కేటాయిస్తారు. ట్రాక్‌ మొత్తం సోలార్‌ ప్యానల్స్‌ను పైకప్పుగా వాడుతున్నారు. సోలార్‌ ప్యానల్స్‌ నుంచి ఉత్పత్తి అయ్యే 16 మెగావాట్ల విద్యుత్తును అక్కడే వినియోగించనున్నారు. సీసీ కెమెరాల నిఘా పెట్టనున్నారు.

గాలిలో తేలినట్లు.. నెక్లెస్‌ రోడ్డులో ఎకో పార్కుతోపాటు యూ ఆకారంలో ఒక వేలాడే వంతెన సాగర్‌ లోపల వరకు నిర్మించారు. ఇందుకు రూ.15 కోట్లు నిధులు కేటాయించారు. ఈ వంతెనపై నిలబడితే జలాలపై తేలియాడినట్లు అనుభూతి కలగనుంది. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి చేశారు. గార్డెనింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో అందుబాటులోకి రానుంది.

పర్యాటక ప్రదేశాల్లో ఆధునిక బస్సులు, టాయ్‌ ట్రైన్‌లు: మరోవైపు రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల్ని వృద్ధి చేయడంపై ప్రభుత్వంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక మార్ట్‌లో వివిధ దేశాల పర్యాటక శాఖలు ఏర్పాటుచేసిన సమాచార స్టాళ్లను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ పరిశీలించారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పర్యాటకుల కోసం ఆధునిక బస్సులను, టాయ్‌ ట్రైన్‌లను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టే అంశంపై చర్చించారు. డబుల్‌ డెక్కర్‌ బస్సు, టాయ్‌ ట్రైన్‌లను ఆయన పరిశీలించారు.

ఇవీ చదవండి: Telangana Tourism పర్యాటక ప్రదేశాల్లో టాయ్‌ ట్రైన్‌లు

పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి

అంతా 'మోదీ'మయమే.. తగ్గని ప్రజాదరణ.. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.