ETV Bharat / state

HC Cancel Land Allotment : బీఆర్ఎస్‌ ఎంపీకి షాక్‌.. సాయి సింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు రద్దు

author img

By

Published : Jun 5, 2023, 7:00 PM IST

Updated : Jun 5, 2023, 10:52 PM IST

HighCourt on Sai Sindhu Foundation : బీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూప్ ఛైర్మన్ బి.పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విలువైన భూమిని అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వనరులకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన సర్కార్.. వ్యక్తులు, సంస్థల దరఖాస్తుల ఆధారంగా కాకుండా.. ప్రజా ప్రయోజనాల కోసం వాటిని కేటాయించాల్సి ఉందని పేర్కొంది. తమకు నచ్చిన వ్యక్తులు, సంస్థలకు భూములు అప్పగించవద్దని.. పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏకపక్షంగా, అసమంజసంగా.. రాజ్యాంగానికి, తన సొంత విధానానికి వ్యతిరేకమని న్యాయస్థానం తెలిపింది. సాయి సింధు ఫౌండేషన్‌కు ఖానామెట్‌ ప్రాంతంలో పదిహేను ఎకరాలివ్వడం చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు.. భూ కేటాయింపుల జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High court
High court

Highcourt on parthasaradhi reddy : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న హెటిరోకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు లీజు ప్రాతిపదికన కేటాయించిన భూమిని హైకోర్టు రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 15 ఎకరాల భూమిని నామామాత్రపు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 59తో పాటు.. అదే ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమోను న్యాయస్థానం కొట్టివేసింది.

రాష్ట్ర వనరులకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. ప్రజలకు నమ్మకం కలిగించేలా ముందుగా ప్రజాప్రయోజనాలకు కేటాయించాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తులు, సంస్థలు చేసే దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వ విధానాన్ని మార్చుకోరాదని స్పష్టం చేసింది. ముప్ఫై ఏళ్లనాటి మార్కెట్ విలువను ఆధారంగా చేసుకుని.. హెటిరో పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూమి కేటాయించిన విధానాన్ని చూస్తే అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని ధర్మాసనం పేర్కొంది.

HC Cancel Land Allotment : ఈ కేటాయింపు చెల్లదని, 2012, 2015లో జారీ చేసిన 571, 218 జీవోలకు అనుగుణంగా.. పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎంపీ, హెటిరో ఛైర్మన్ బి.పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలుచేస్తూ ది రైట్ సొసైటీ, డాక్టర్ ఊర్మిళా పింగ్లే తదితరులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం 125 పేజీల తీర్పును వెలువరించింది.

భూకేటాయింపుల విధివిధానాలపై ప్రభుత్వం 2012, 2015ల్లో జారీ చేసిన జీవోలకు విరుద్ధంగా.. సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల లీజుకిచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. బసవతారకం ఆస్పత్రికి కేటాయించిన విధంగా ఏడాదికి 50,000 లీజు ఖరారు చేసి.. మూడేళ్లకోసారి 5 శాతం పెంంచాలని నిర్ణయించడం తగదని వాదించారు. సాయి సింధు ఫౌండేషన్‌కు కేటాయించిన భూమి లీజు ఏడాదికి రూ.1,47,743 మాత్రమే ఉంటుందని.. దానిప్రకారం 60 ఏళ్లలో ప్రభుత్వానికి రూ.5,346 కోట్ల నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు వాదించారు.

HighCourt on Sai Sindhu Foundation : ప్రభుత్వ విధానం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువలో లీజు 10 శాతం ఉండాలని.. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మార్కెట్ విలువ ఆధారంగా 10 శాతం సవరించాలన్నారు. సాయి సింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వ విధానం ప్రకారం కేటాయింపులు జరిపితే.. మొదటి ఏడాది నుంచే రూ.50 కోట్లు లీజు చెల్లించాల్సి ఉంటుందని వాదించారు. మార్కెట్ విలువ ప్రకారం 1989లో చదరపు గజం రూ.50 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.60,000 నుంచి రూ.70,000 దాకా ఉందని హైకోర్టుకు వివరించారు .

ప్రభుత్వం 2016 లోనే అక్కడ వేలం నిర్వహించగా ఎకరా ధర రూ.29 కోట్ల పలికిందని వాదించారు. పార్ధసారథి రెడ్డికి చెందిన హెటిరో గ్రూపు కంపెనీ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటోందని వివరించారు. ఎలాంటి బహిరంగ వేలం వేయకుండా, నోటీసు ఇవ్వకుండా భూకేటాయింపు చట్టవిరుద్ధమని పిటిషనర్లు ధర్మాసనానికి తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీర్పు వెల్లడించింది.

HC quashes land allotment Sai Sindhu Foundation : కలెక్టర్ ప్రతిపాదనలకు, భూకేటాయింపు అథారిటీ ఆమోదానికి విరుద్ధంగా.. సాయి సింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు ఉందని హైకోర్టు పేర్కొంది. జీవో 571లోని లీజు మార్గదర్శకాలను పట్టించుకోలేదని ధర్మాసనం తప్పుపట్టింది. మార్కెట్ విలువ చదరపు గజం రూ.75,000 అని భూకేటాయింపు అథారిటీ నిర్ణయించిందని.. కానీ ప్రభుత్వం మాత్రం బసవతారకం ఆస్పత్రికి 1989లో కేటాయించిన ధరనే ప్రాతిపదికగా తీసుకుందని న్యాయస్థానం తెలిపింది.

కలెక్టర్, అథారిటీల సిఫారసులను, ప్రభుత్వ విధానాన్ని పక్కనపెట్టి.. భూమిని కేటాయించడానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదని ధర్మాసనం తప్పుపట్టింది. భూకేటాయింపులో ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదంది. బసవతారకం ఆస్పత్రికి 1989లో భూమిని కేటాయించినప్పుడు.. ప్రభుత్వానికి ఎలాంటి విధానం లేదని హైకోర్టు ప్రస్తావించింది. ఏడాదికి రూ.50,000 చొప్పున, మూడేళ్లకు 5 శాతం పెంచేలా నిర్ణయించే అప్పటి లీజును యథాతథంగా తీసుకునే ముందు.. హైదరాబాద్‌లో 30 ఏళ్లలో అమాంతం పెరిగిన భూముల విలువను పట్టించుకోలేదని న్యాయస్థానం పేర్కొంది.

నామమాత్రపు విలువకే కేటాయించింది : విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు బహిరంగ వేలం, టెండరు విధానం అవసరం లేకపోయినా.. కనీసం ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అయినా అనుసరించాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం సాయి సింధు ఫౌండేషన్‌కు కేటాయించిన భూమి చదరపు అడుగు రూ.70,000 నుంచి రూ.80,000 ఉందని అథారిటీ పేర్కొందని వివరించింది. ఆస్పత్రి నిర్మాణానికి 10 ఎకరాలు చాలని సిఫారసు చేసినా.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం 15 ఎకరాలను ఏడాదికి కేవలం లక్ష నలభై ఏడు వేలకే లీజులు కేటాయించిందని పేర్కొంది. అంటే ప్రభుత్వం 15 ఎకరాలను నామమాత్రపు విలువకే కేటాయించిందని ధర్మాసనం వెల్లడించింది.

ఇదేమీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కాదు : ఇదేమీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కాదని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం, అధికారులు తమకు నచ్చిన వ్యక్తి, సంస్థలకు కేటాయించడానికి వీల్లేదని.. ప్రతి కేటాయింపూ పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని పేర్కొంది. పెద్ద మొత్తంలో భూమిని కేటాయించే ముందు పారదర్శకత, సమన్యాయం పాటించాల్సి ఉందని వివరించింది. వ్యక్తులు, సంస్థలు పెట్టుకునే దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర విధానాలను వ్యతిరేకంగా ఉండరాదని ధర్మాసనం వెల్లడించింది.

అధికరణ 14కు విరుద్ధం : వ్యక్తులు, సంస్థలు పెద్ద మొత్తంలో భూమి కేటాయింపు కోసం దరఖాస్తులు చేసుకున్నప్పుడు.. ఇదే విషయంలో అర్హత ఉంటూ పోటీకి వచ్చేవారిని మినహాయించడం కూడా సరికాదని హైకోర్టు తెలిపింది. ఒకరికి ఏకపక్షంగా కేటాయించడం, మరొకరి పట్ల వివక్ష చూపడం, వారికి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని స్పష్టం చేసింది. విద్య, వైద్య సంస్థలకు భూమిని కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే సమానత్వ సిద్ధాంతానికి అనుగుణంగా జరిపేలా కసరత్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొందని వెల్లడించింది.

ప్రస్తుత భూకేటాయింపు ఏకపక్షం, అసమంజసమని, ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం.. రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. భూకేటాయింపును సమర్థిస్తూ అడ్వకేట్ జనరల్ బీఎస్‌ ప్రసాద్ ప్రస్తావించిన తీర్పులు ఇక్కడ వర్తించవని.. వాటితో ఏకీభవించలేమని పేర్కొంది. ఉన్నత లక్ష్యంతో ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని.. వేగంగా జరుగుతున్న నిర్మాణం సెప్టెంబరు కల్లా పూర్తవుతుంది కాబట్టి జోక్యం చేసుకోరాదంటూ హెటిరో చైర్మన్ పార్ధసారథిరెడ్డి, సాయిసింధు ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

HighCourt shock for BRS MP : ఏ నిర్మాణం జరిగినా తుది తీర్పునకు లోబడి ఉండాలని.. 2021 ఫిబ్రవరి 11నే మధ్యంతర ఉత్తర్వులు చేసినట్లు హైకోర్టు గుర్తుచేసింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా చట్ట ఉల్లంఘనలను విస్మరించలేమని.. అంతేకాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఫౌండేషన్‌కు ఎలాంటి అదనపు హక్కులు సృష్టించవని తేల్చి చెప్పింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా మినహాయింపులు కుదరవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భూకేటాయింపు జరుపుతూ జారీ చేసిన జీవోను 59ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ విధానం ప్రకారం పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చదవండి: Telangana Group-1 Prelims Exam : గ్రూప్-1 వాయిదాకు హైకోర్టు నిరాకరణ, ఈనెల 11న ప్రిలిమ్స్

Telangana AP IAS IPS Allotment Issue : ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

Last Updated : Jun 5, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.