ETV Bharat / state

భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు

author img

By

Published : Sep 17, 2020, 7:33 AM IST

heavy-rains-and-floods-in-telangana
రాష్ట్రంలో భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. భారీగా వరద పోటెత్తుతుండడంతో... లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి. ఇప్పటికే 10వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. ప్రవాహ ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి... రాకపోకలు స్తంభించిపోయాయి.

రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలు... లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి, శనిగరం గ్రామాల మధ్య పిల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న మోయతుమ్మెద వాగు ప్రవాహంతో... శనిగరం ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పోస్తోంది. పిల్లివాగు రహదారి పైనుంచి ప్రవహిస్తుండడంతో తంగళ్లపల్లి నుంచి శనిగరం, బెజ్జంకి మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు

అంతా జలమయం...

మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఓ కుంటకు గండి పడగా... వరదనీరు సమీప పొలాల్లోకి వెళ్లింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో లింగారెడ్డి కుంటకు గండి పడింది. నర్సాపూర్ సమీపంలోని రాయరావు చెరువు జలకళ సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గంటన్నర పాటు ఏకధాటిగా వాన పడడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అటు జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. మాడిగి, ధనసిరి గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

మృత్యువాత పడ్డ గేదెలు

నిర్మల్‌లో గంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల మీదుగా పారే నారింజ వాగు పొంగడంతో మినుము, సోయా, పత్తి, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల- ధర్మపురి మధ్య జాతీయ రహదారిపై నుంచి పొంగుతున్న వాగు ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోగా... గమనించిన స్థానికులు అతడిని కాపాడి వాహనాన్ని బయటకు తీశారు. జగిత్యాల జిల్లా పొలాస ఎల్లమ్మ చెరువు వద్ద గేదెలు మేత కోసం అలుగు దాతుండగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఇందులో 20 గేదెలు మృత్యువాత పడ్డాయి.

కాపాడారు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు డిండి వాగులో చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న కలెక్టర్‌ శర్మన్‌... హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు ప్రవాహ ఉద్ధృతికి ఓ శునకం కొట్టుకుపోయి ముళ్లపొదల్లో చిక్కుకోగా... హెడ్‌కానిస్టేబుల్‌ ముజీబ్‌ జేసీబీ సాయంతో రక్షించారు.

ముందెప్పుడు చూడలేదు..

భారీ వర్షాలకు అతలాకుతలమైన వనపర్తి పట్టణంలోని పలు కాలనీల్లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. వరదలకు తీవ్ర ప్రభావితమైన శ్వేతానగర్‌కాలనీ, గాంధీచౌక్, అంబేడ్కర్‌ చౌరస్తా, బ్రహ్మంగారి వీధి, శ్రీరామ టాకీస్ ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు పట్టణంలో కలెక్టర్‌ యాస్మిన్‌భాష, ఎస్పీ అపుర్వారావు అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మునుపెన్నడూ ఇంత భారీ వర్షం చూడలేదని వనపర్తివాసులు వాపోయారు.

ఇదీ చూడండి: అలర్ట్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.