ETV Bharat / state

Harish rao comments on Piyush Goyal: 'రైతులకు పీయూష్‌ గోయల్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలి'

author img

By

Published : Dec 22, 2021, 11:35 AM IST

Updated : Dec 22, 2021, 12:25 PM IST

Harish comments on Piyush goyal : దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని ఆక్షేపించారు. 70లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్తే... యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.

Harish comments on Piyush goyal, harish press meet
హరీశ్ రావు ప్రెస్​మీట్

Harish comments on Piyush goyal : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 70 లక్షలమంది రైతుల తరఫున మంత్రులు దిల్లీ వెళ్తే.. అన్నదాతల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా గోయల్‌ మాట్లాడారని హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన చులకనచేసి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపా నేతలను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ.. ధాన్యం అంశంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. అసత్య ప్రచారంతో బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. దిల్లీలో పీయూష్‌ గోయల్‌ నిన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

'పచ్చి అబద్ధాలు'

గోదాముల సామర్థ్యంపై లేఖ రాయలేదని పచ్చి అబద్ధాలు చెప్పారని.. పదిసార్లు లేఖలు రాశామని తెలిపారు. బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని... గోదాములు ఇవ్వాలని లేఖలు రాశామని హరీశ్‌రావు వెల్లడించారు. ఈ నెల 10 న కూడా కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖ రాశామని... నెలకు 10 మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని లేఖ రాసినట్లు వెల్లడించారు. నెలకు 4.5 మెట్రిక్ టన్నులే తీసుకుంటున్నారని లేఖ రాసినా... పట్టించుకోలేదని అన్నారు. పైగా తమపైనే మళ్లీ నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం ఇవ్వలేదనీ గోయల్‌ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

మంత్రులను ‘మీకేం పని లేదా’ అని పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే. 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. 70 లక్షలమంది ప్రయోజనాలు కాపాడటమే మా ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజలను అవమానించేలా పీయూష్ గోయల్ మాట్లాడారు. పీయూష్ గోయల్ అన్నదాతలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని కోరుతున్నాం. రైతుల ఓట్లు కావాలంటారు.. ధాన్యం మాత్రం కొనబోమంటారు. గోయల్ పచ్చిఅబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా కుటిల నీతికి ఇదే నిదర్శనం.

-హరీశ్‌రావు, మంత్రి

'రాజకీయం ఎక్కడ ఉంది?'

పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలని కోరామని.. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణకు ఒకే విధానం ఉండాలని కోరినట్లు మంత్రి హరీశ్‌ తెలిపారు. తాము కోరిన అంశాల్లో రాజకీయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 67 వేలమంది రైతులకు రూ.5 లక్షల చొప్పున బీమా ఇచ్చామని తెలిపారు. రైతుబంధు కింద రూ.14,500 కోట్లు సహాయం చేశామని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నామని.. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాల్లో రైతులకు మేలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

రైతుల ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తున్నారు. కేంద్రం నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా సక్రమంగా చేయరు. తెలంగాణను కించపరిచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. 70 లక్షలమంది రైతుల పక్షాన బృందంగావస్తే కించపరుస్తారా?. తెరాస ఓటమిపై మాట్లాడటం ఏంటి?. ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా ఓడిపోలేదా?. గెలుపును చూసి మేమెప్పుడూ విర్రవీగలేదు. తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గోదాముల సామర్థ్యంపై లేఖ రాయలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. గోదాముల సామర్థ్యం పెంచాలని పదిసార్లు లేఖలు రాశాం. బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం... గోదాములు ఇవ్వాలని లేఖలు రాశాం. పార్లమెంట్ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తాం. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీయూష్ గోయల్‌కు తగదు.

-హరీశ్‌రావు, మంత్రి

'కేంద్రమంత్రిగా కాదు.. రాజకీయ నేతలా మాట్లాడారు..!'

పీయూష్ గోయల్ కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని.. అది మంత్రులను కాదు రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆరోపించారు. మంత్రులు దిల్లీకి వస్తే పనేమీ లేదా? అనడం అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కరవు వస్తే మెడమీద కత్తి పెట్టి గతంలో ధాన్యం సేకరించలేదా? అని ప్రశ్నించారు.

మా ప్రాధాన్యత రైతులు.. మీ ప్రాధాన్యత రాజకీయం. అవహేళనగా, అవమానకరంగా మాట్లాడటం సరికాదు. తెరాస పుట్టిందే ప్రజల కోసం. రాష్ట్రం, రైతు ప్రయోజనాలకంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. ఒక ఓటు 2 రాష్ట్రాలంటూ వెన్నుపోటు పొడిచిన చరిత్ర భాజపాది. ధాన్యం కొనుగోళ్లకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరాం. చేతకాకపోతే ధాన్యం ఎగుమతి, దిగుమతులను రాష్ట్రాలకు ఇవ్వాలి. అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలను సహించం. రైతుల పక్షాన మంత్రులు వచ్చారు... భిక్షం అడగటానికి కాదు. రైతులపై కారెక్కించిన కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయలేదు. రైతులపై భాజపాకు ఉన్న ప్రేమ ఇదేనా?.

-హరీశ్‌రావు, మంత్రి

హరీశ్ రావు ప్రెస్​మీట్

ఇదీ చదవండి: Honey Trap Cases: అందమే పెట్టుబడి.. అందినకాడికి దోచుకోవడమే వారి పని

Last Updated :Dec 22, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.