Honey Trap Cases: సాంకేతికత, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగేకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఓటీపీలు, హ్యాకింగ్‌లే కాదు మాటలతోనే మాయచేసి లూటీ చేసేస్తున్నారు. వలపువల విసురుతూ... నగ్న వీడియోలు సేకరించి నట్టేట ముంచుతున్నారు. ఫేస్‌బుక్‌తో పరిచయమై వాట్సాప్‌లో స్నేహం పెంచుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.
రిక్వెస్ట్‌తో మొదలై...
హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. వారం రోజులపాటు ఫేస్‌బుక్‌లో మాటామాటా కలుపుకున్నారు. ఆ తర్వాత చరవాణి నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనతి కాలంలోనే ఇద్దరి మధ్య స్నేహం వీడియోకాల్స్ వరకూ చేరింది. కైపెక్కించే మాటలో కవ్వించడం మొదలుపెట్టిన యువతి... నగ్నంగా వీడియోకాల్ చేసింది. యువకుడినీ నగ్నంగా మారాలని ప్రోత్సహించింది. చివరికి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి ప్రైవేట్ ఉద్యోగికి పంపించింది. డబ్బులు డిమాండ్ చేయడంతో పరువు పోతుందని లక్ష రూపాయలకు పైగా యువతి చెప్పిన ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో చేసేది లేక బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏకంగా ప్రాణాలే వదిలేసి...
గోషామహల్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 10లక్షలు సమర్పించుకున్నాడు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి డబ్బులు చెల్లించలేక ప్రాణాలే తీసుకున్నాడు. ఈ తరహా నగ్న చిత్రాల మోసాలు రాజస్థాన్‌కు చెందిన ముఠాలే చేస్తున్నాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. నిజానికి వీడియోకాల్ చేసే యువతులు నగ్నంగా కనిపించారని... పోర్న్ వీడియోలతో బాధితులను బోల్తా కొట్టిస్తున్నారని వివరిస్తున్నారు.
వెస్ట్‌బెంగాల్‌లో ఎక్కువగా...
చాటింగ్‌లు నగ్నవీడియోలే కాదు... యాప్‌లు, వెబ్‌సైట్‌లతోనూ సైబర్ నేరగాళ్లు అమాయకులతో ఆడుకుంటున్నారు. పోర్న్ వీడియోలు చూసేవారిని లక్ష్యంగా చేసుకుని ఒంటరిగా ఉన్న మహిళలను కలవొచ్చని అందమైన అమ్మాయిలతో సరదాగా గడపొచ్చని చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ముఠాలు వెస్ట్‌బెంగాల్‌లో ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
పరువు కోసం...
పరువుకు సంబంధించిన విషయం కావడం వల్ల మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు వెనకడుగు వేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఈ తరహా మోసాలకు సంబంధించి పదికి పైగా కేసులు నమోదయ్యాయి. కానీ అంతకంటే పదిరెట్ల మంది బాధితులుండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులను ప్రతిసారీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పట్టుకోవడం సాధ్యం కాదంటున్న పోలీసులు... పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచిస్తున్నారు.
అందం, అత్యాశ, అజాగ్రత్త ఇలా అమాయకుల బలహీనతలే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండటమే అన్నివిధాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి:
Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'
Honey trap to software engineer : 'పెళ్లి చేసుకుందామని.. రూ.95 లక్షలు కాజేసింది'