ETV Bharat / state

నేలబారు చదువులు.. సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం

author img

By

Published : Jul 25, 2022, 5:22 AM IST

రాష్ట్రంలోని సర్కారీ పాఠశాలల్లో పేద పిల్లల చదువు నేలబారుతోంది. సకాలంలో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాల్సిన విద్యాశాఖ చివరివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలుస్తోంది. ఫలితంగా బడులు తెరిచి నెల దాటినా ఇప్పటికీ సగం మందికి  పుస్తకాలు అందలేదు. అంతే కాకుండా అనేక పాఠశాలల్లో తగినంతమంది ఉపాధ్యాయులు కూడా లేరు.

government-school-children-problems-in-telangana
government-school-children-problems-in-telangana

Government School Children Problems: రాష్ట్రంలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం పేద పిల్లల చదువుకు శాపంగా మారింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాల్సిన విద్యాశాఖ చివరివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా బడులు తెరిచి నెల దాటినా ఇప్పటికీ సగం మందికి పుస్తకాలు అందలేదు. తగినంతమంది ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు లేకుండా సర్కారు బడుల్లో పిల్లలు.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ఎలా పోటీపడగలరని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్‌ స్థాయి వసతులు అంటూ ఊరించిన విద్యాశాఖ అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలేదు. ఈసారి ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు.. భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉందని చెప్పిన ఆ శాఖ కనీస చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.

సార్లు లేరు.. పుస్తకాలూ ఆలస్యం
విద్యాశాఖ గణాంకాల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఈ విద్యా సంవత్సరం కొత్త ఉపాధ్యాయులు రావడం అనుమానమే. కనీసం విద్యా వాలంటీర్లనైనా నియమించడం లేదు. గతంలో 12,600 మంది వాలంటీర్లు పనిచేసేవారు. రాష్ట్రంలో 31.24 లక్షల మంది విద్యార్థులకు 1.70 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. ఈ నెల 22వ తేదీ వరకు 80 శాతం పుస్తకాలను జిల్లా కేంద్రాలకు పంపారు. వాటిని మండల కేంద్రాలకు, అక్కడి నుంచి బడులకు పంపేసరికి మరో 20 రోజులకు పైగా పడుతుందని అంచనా. గత ఏడాది ఏకరూప దుస్తులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అసెంబ్లీకి నివేదించిన విద్యాశాఖ ఈసారి కూడా వాటిని సకాలంలో అందించలేకపోతోంది. పాఠశాలలు తెరిచి నెల దాటినా నిర్వహణ నిధులూ మంజూరు చేయలేదు.

.

రాదారే బడి!
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీలోని పెద్ద సల్పలగూడ గిరిజన విద్యార్థుల బడి కష్టాలివి. పదేళ్ల కిందట పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా గుత్తేదారు మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో రహదారిపైనే విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. గతంలో పూర్తిస్థాయి ఉపాధ్యాయుడు ఉండేవారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపాధ్యాయుడు సీఆర్‌టీ పాఠాలు చెబుతున్నారు.

.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 640 మంది విద్యార్థులున్నారు. 6-10 తరగతుల విద్యార్థులకు కేవలం 180 సెట్ల పుస్తకాలను అందజేశారు. వీటిలో కూడా అన్ని సబ్జెక్టులవి రాలేదు. ఒక్కో విద్యార్థికి 3 నుంచి 4 పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. ఏకరూప దుస్తుల కోసం వచ్చిన వస్త్రాన్ని దర్జీలకు ఇచ్చి 15 రోజులైనా అవీ అందలేదు. జీవశాస్త్రం, తెలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల్వంచ మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 173 మంది విద్యార్థులుండగా, ఆరో తరగతి ఆంగ్లం, తెలుగు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఏడో తరగతి హిందీ, ఇంగ్లిష్‌, సామాన్యశాస్త్రం పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. ఏకరూప దుస్తుల జాడలేదు. ఇక్కడ సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయ పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.

.

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో 60 పాఠశాలలకు 22 వేలకు పైగా పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉండగా, 40శాతం మందికి మాత్రమే వచ్చాయి. వెల్దండ మోడల్‌ స్కూల్‌లో 30శాతం మందికి పుస్తకాలొచ్చాయి. 30 శాతం మంది విద్యార్థుల వద్ద పాత పుస్తకాలున్నాయి. మిగిలిన వారు పక్కవారి వద్ద తీసుకుని వంతుల వారీగా చదువుకుంటున్నారు.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ప్రాథమిక పాఠశాలలో 196 మంది విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందలేదు. గతంలో చదివిన విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు సేకరించి కొందరికి పంపిణీ చేశారు.

* మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదు. ఆరో తరగతి తెలుగు, ఇంగ్లిష్‌, ఏడో తరగతి సాంఘిక శాస్త్రం, ఎనిమిదిలో తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం, పదో తరగతి సాంఘిక, భౌతిక శాస్త్రాల పుస్తకాలు రాలేదు. మండలంలోని అన్ని పాఠశాలల్లో కలిపి 301 మంది పోస్టులకు గాను 267 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 34 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కలలో ప్రాథమిక స్థాయి నుంచి అప్‌గ్రేడ్‌ అయిన జడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 130 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 107 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ అయిదుగురు ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. 6-10 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధించాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. మండలంలోని అన్ని పాఠశాలల కంటే ఈ పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చింది.

"పాఠశాల విద్యాశాఖపై గత రెండు మూడేళ్లుగా ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష చేయలేదు. అప్పుడప్పుడు ప్రతిపాదనలు పంపినా వాటిని ఆమోదించడం లేదు. దానివల్ల అధికారులూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఆంగ్ల మాధ్యమం, మన ఊరు-మన బడి అంటూ ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదు. పుస్తకాలు, యూనిఫాం కోసం తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు..

- సదానందం గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌టీయూటీఎస్‌

ఇదీ చదవండి: మూతపడిన రైల్వే 'స్వజల్‌' ఆర్వో ఫ్లాంట్‌లు.. దాహార్తితో అలమటిస్తున్న ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.