ETV Bharat / state

ఎల్లారెడ్డిపేటలో వేడెక్కిన రాజకీయం.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్​

author img

By

Published : Mar 19, 2022, 3:22 PM IST

ఎల్లారెడ్డిపేటలో వేడెక్కిన రాజకీయం.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్​
ఎల్లారెడ్డిపేటలో వేడెక్కిన రాజకీయం.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్ట్​

Rajasingh Arrest: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో క్షతగాత్రులైన భాజపా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేటకు వెళ్తున్న రాజాసింగ్‌ను అల్వాల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్టు చేసి అల్వాల్ ఠాణాకు తరలించారు.

Rajasingh Arrest: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తెరాస కార్యకర్తల చేతుల్లో దాడులకు గురైన భాజపా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడ్డ భాజపా కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న తనను అక్రమంగా పోలీసులు నిర్బంధించారని ఎమ్మెల్యే రాజాసింగ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్​లో తమ కార్యకర్తలపై తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడిన దృష్ట్యా తాను వారిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపడం అప్రజాస్వామికమని అన్నారు.

మాజీమంత్రి చంద్రశేఖర్, సంగప్పతో కలిసి ఎల్లారెడ్డిపేటకు వెళ్తున్న రాజాసింగ్​ను అల్వాల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు ఉన్న మాజీమంత్రి చంద్రశేఖర్, సంగప్పలను పంపించివేసిన పోలీసులు.. రాజాసింగ్​ను అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసులు తెరాస కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. గాయపడ్డ భాజపా కార్యకర్తలను పరామర్శించి తీరుతామని.. పోలీస్ స్టేషన్​లో దాడికి పాల్పడ్డ తెరాస నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసేంతవరకు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..

సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తెరాస, భాజపా నాయకుల మధ్య గొడవలకు దారి తీశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు విడతల్లో జరిగిన గొడవల్లో ఇద్దరు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అల్లర్లను అదుపుచేసే క్రమంలో సీఐ, ఎస్సైలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకూ గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు రేపాక రామచంద్రరెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ మూడ్రోజుల క్రితం తెరాస నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో పదిరకు చెందిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోనాల సాయి ఇంటికి శుక్రవారం తెరాస నాయకులు వచ్చారు. సాయి ఇంట్లో లేడని వాళ్ల అమ్మ మణెమ్మ చెప్పడంతో వెనుదిరిగారు. ఆందోళనకు గురైన ఆమె సాయంత్రం భాజపా నాయకులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెరాస నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెరాస నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో రెండు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు దిగారు. రేపాక రామచంద్రారెడ్డి, బీజేవైఎం మండల కార్యదర్శి ఎలేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పరస్పరం రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు

పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌ ఆవరణ నుంచి బయటకు పంపించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించి రెండు పార్టీల నాయకులు భారీగా ఎల్లారెడ్డిపేటకు చేరుకుని నినాదాలు చేశారు. పాత బస్టాండ్‌ ప్రాంతంలో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్న భాజపా కార్యకర్తల సెల్‌ఫోన్లను తెరాస నాయకులు లాక్కొని పగులగొట్టారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా తెరాస నాయకులపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన భాజపా నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. వీరిని పోలీసులు తరలిస్తుండగా ఒక్కసారిగా అక్కడి నుంచి తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటి వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో దారిలో ఉన్న తెరాస నాయకులకు చెందిన రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో సీఐ బన్సిలాల్‌, ఎస్సై శేఖర్‌లతోపాటు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భాజపా నాయకుల ఫిర్యాదు మేరకు తెరాస నేతలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మొగిలి తెలిపారు.

ఈ నేపథ్యంలో గాయపడిన భాజపా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.