భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్న వరుస అగ్నిప్రమాదాలు - ఏడాదిన్నర వ్యవధిలో ఏకంగా 37 మంది అగ్నికి ఆహుతి

భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్న వరుస అగ్నిప్రమాదాలు - ఏడాదిన్నర వ్యవధిలో ఏకంగా 37 మంది అగ్నికి ఆహుతి
Fire Accidents in Hyderabad 2023 : జనావాసాల్లోనే రసాయన గోదాముల్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తోంది. ఇళ్ల మధ్యలో ఉంటున్న రసాయన నిల్వలపై తనిఖీలు చేయాలన్న స్పృహ లేకపోవడం ఒక తప్పిదమైతే.. ఫిర్యాదులందినప్పుడైనా పట్టించుకోకపోవడం ఘోర ప్రమాదాలకు తావిస్తోంది. ఇలా హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏ పాపం ఎరగని సామాన్యులే సమిదలయ్యారు.
Fire Accidents in Hyderabad : హైదరాబాద్ బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన(Bazarghat Fire accident Incident) తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఏకంగా తొమ్మిది ప్రాణాలు బలి కావడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అక్రమంగా రసాయనాల్ని నిల్వ చేస్తున్నట్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రసాయన గోదాముల నిర్వహణకు స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ అనుమతి పొందిన ప్రాంతంలో కాకుండా వేరేచోట్ల అక్రమంగా గోదాములు నిర్వహిస్తున్నట్లు.. ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడుతున్నాయి. వాస్తవానికి జనావాసాల్లో ఇలాంటి రసాయనాల్ని నిల్వ ఉంచడం నిషేధం. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు లోపల రెడ్, ఆరెంజ్ విభాగంలోని సుమారు 1350 పరిశ్రమల్ని వెలుపలికి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా.. పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
Last Three Years Fire Accidents in Telangana : రసాయనాలు లేదా ఇతర సామగ్రిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2021లో 139, 2022లో 236, ఈ ఏడాది ఆగస్టు నాటికి 132 ప్రమాదాలు జరిగాయి. నాంపల్లి బజార్‌ఘాట్ ప్రమాదంతో పాటు.. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒక్క రాజధాని ప్రాంతంలోనే ఐదు ఘోర దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏకంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ గోదాంలో గతేడాది మార్చిలో జరిగిన ప్రమాదంలో 11 మంది బిహారీ వలస కూలీలు అగ్నికి ఆహుతయ్యారు. సికింద్రాబాద్ రూబీ హోటల్(Ruby Hotel Fire Accident in Secunderabad) సెల్లార్లో గతేడాది సెప్టెంబరులో జరిగిన దుర్ఘటనలో 8 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. సెల్లార్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Last one Year People died Fire Accidents in Hyderabad : సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ నిట్ వేర్, స్పోర్ట్స్ షాపులో గత జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు బిహారీలు జునైద్, వసీం, జాహెద్ దుర్మరణం పాలయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలంటుకొని పైకి వ్యాపించిన ఈ ప్రమాదంలో మరో నలుగురిని రక్షించగలిగారు. ప్రమాదాన్ని నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఈ అక్రమ నిర్మాణాన్ని తర్వాత కూల్చివేశారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ (Swapnalok Complex Fire Accident)మార్చి 17న జరిగిన అగ్నిప్రమాదంలో క్యూ నెట్ సంస్థ ఉద్యోగులు శివ, ప్రశాంత్, వెన్నెల, పరిమళ, శ్రావణి, త్రివేణి దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు బజార్ ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది.
ఏడాదిలో హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదాల వివరాలు :
జరిగిన ప్రదేశం | మృతుల సంఖ్య | ప్రమాదం జరిగిన నెల |
సికింద్రాబాద్ బోయిగూడ | 11 | 2022 మార్చి |
సికింద్రాబాద్ రూబీ హోటల్ | 8 | 2022 సెప్టెంబర్ |
సికింద్రాబాద్ నల్లగుట్ట | 3 | 2022 జనవరి |
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ | 6 | 2023 మార్చి |
హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్ | 9 | 2023 నవంబర్ |
మొత్తం | 37 |
