ETV Bharat / state

Fire Accident at Shopping Mall in Habsiguda : హబ్సిగూడలో అగ్నిప్రమాదం.. మంటలు ఆపేందుకు 4 గంటలు

author img

By

Published : Aug 2, 2023, 10:01 PM IST

Fire Accident in Hyderabad : హైదరాబాద్‌ హబ్సిగూడలోని నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆన్‌ లిమిటెడ్‌ వస్ర దుకాణంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి.. మొదటి అంతస్తుకు వ్యాపించాయి. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. నాలుగైదు గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చారు. వస్త్రదుకాణం కావటంతో దట్టమైన పొగలు అలుముకుని పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురికాగా.. సహాయక చర్యల కారణంగా ఉప్పల్‌- హబ్సిగూడ మార్గంలో కాసేపు రాకపోకలకు అంతరాయం నెలకొంది.

Fire Accident at Habsiguda
Fire Accident at Shoping Mall in Habsiguda

హబ్సిగూడలో అగ్నిప్రమాదం

Fire Accident at Habsiguda Today : హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరగటం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేయటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్‌- సికింద్రాబాద్ మార్గంలోని హబ్సిగూడ వద్ద రోడ్డు పక్కనున్న నాలుగంతస్థుల భవనంలో కింది రెండు అంతస్థుల్లో అన్‌లిమిటెడ్‌ వస్త్ర దుకాణం, పైరెండంతస్థుల్లో హోటల్‌ కొనసాగుతున్నాయి. రెండో అంతస్తులో తెల్లవారుజామున మంటలు చెలరేగగా.. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తొలుత రెండు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసినా.. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మరో 6 శకటాలను రంగంలోకి దించారు. అయినా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. వస్త్రదుకాణం అద్దాలను బుల్డోజర్‌ల సాయంతో పగలగొట్టి.. హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

Fire Accident at Unlimited Cloth Show Room in Habsiguda : తెల్లవారుజామున ఐదున్నరకి ప్రమాదం జరగ్గా.. 8 ఫైరింజిన్లు, 40 మంది సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌ రావు తెలిపారు. రెండో అంతస్తులో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. ఆస్తి నష్టం ఎంత మేర సంభవించిందనే దానిపై అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంటలు తగ్గిపోయినా.. వస్త్ర దుకాణం కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిసర ప్రాంతాలను కమ్మేయటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో అధికారులు ముందుగానే మూసివేయించారు. రోడ్డు పక్కనే ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం జరగటంతో.. ఉప్పల్‌ నుంచి హబ్సిగూడ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే మార్గంలో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Hyderabad Fire Accident Today : వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం..

ప్రమాదం జరిగిన భవనాన్ని ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌, కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి తెలిపారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని.. నిబంధనలు గాలికొదలటంతోనే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

"హబ్సిగూడలో అగ్ని ప్రమాదం జరుగుతుందని సుమారు ఉదయం 5:30కి మాకు కాల్​ వచ్చింది. రెండు ఫైర్​ ఇంజిన్లను తీసుకువచ్చాం. ఇది నాలుగు అంతస్తుల భవనం వల్ల మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. షాపింగ్​ మాల్​ అద్దాలతో ఉన్నది. షట్టర్స్​ తెరిచి మంటలు అదుపులకి తీసుకు వచ్చాం. రెండో అంతస్తు ఎక్కువగా ప్రమాదం జరిగింది. మిగిలినవి బాగానే ఉన్నాయి. రెండో అంతస్తులో మంటలు ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టింది." - మధుసూధన్‌రావు, అగ్నిమాపక శాఖ అధికారి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.